దివ్యాంగుడికి నిలిచిపోయిన పింఛన్
ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చనిపోయినట్లు వెల్లడి
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితుడు
తమకేం సంబంధం లేదంటున్న అధికారులు
శంకరపట్నం: ‘సర్ నేను మానసిక వికలాంగుడిని.. కొన్నాళ్లుగా సర్కారు ఇచ్చే పెన్షన్‌తోనే బతుకుతున్నా.. రెండు నెలలుగా నాకు పెన్షన్ రావడం లేదు. అధికారులను అడిగితే.. ఆన్‌లైన్‌లో నేను చనిపోయినట్లు చూపుతోందని అంటున్నారు’. నాకు పెన్షనే ఆధారం.. రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు’. అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన తోట శ్రీనివాస్(39) వాపోయాడు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీనివాస్ మానసిక దివ్యాంగుడు. నెలకు రూ.4016 చేయూత పెన్షన్ వస్తోంది. దాంతోనే శ్రీనివాస్ బతుకుతున్నాడు. రెండు నెలలుగా తన ఖాతాలో పెన్షన్ పడడం లేదు. కారణం ఏంటని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, జిల్లా కార్యాలయాల్లో కలిశాడు. పింఛన్ వెబ్‌సైట్‌ను పరిశీలించగా జూన్4న శ్రీనివాస్ చనిపోయినట్లు నమోదు చేసి ఉంది. ఆందోళన చెందిన శ్రీనివాస్ తాను బతికుండానే ఎలా చంపేస్తారని అధికారులు, కార్యదర్శులను ప్రశ్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై కలెక్టర్ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. గ్రామ కార్యదర్శిని ‘సాక్షి ’ వివరణ కోరగా.. ‘శ్రీనివాస్ పెన్షన్‌కు సంబంధించి లైవ్ సర్టిఫికెట్ మే16న పంపించాను. ఆ సమస్య నా దృష్టికి వచ్చింది. జిల్లా అధికారులకు నివేదించాను. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించి, పెన్షన్ వచ్చేలా చూస్తాం’ అని సమాధానం ఇచ్చారు.


