కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొత్త పింఛన్లకు అర్హత పొందే వారిని గుర్తించి, వారం రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు. మంగళవారం తన కార్యాలయంలో డీఆర్డీవో, జిల్లా సంక్షేమశాఖ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నందున ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి అర్హులు దరఖాస్తు చేసుకునేలా చైతన్యం కల్పించాలని ఆదేశించారు. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు చెందినవారిని గుర్తించాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు చొప్పదండి, హుజూరా బాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రక్రియను సవాలుగా తీసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది జాబితా తయారీ వరకు ఎక్కడా తప్పిదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్‌డీవో గీత, మెప్మా పీడీ స్వరూపారాణి, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.


