జగిత్యాలటౌన్: రాష్ట్రంలో చదువురాని ముఖ్యమంత్రి చదువుల మంత్రిగా ఉన్నారని, చదువు విలువ తెలియకపోవడం వల్లే కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపులో అవాంతరాలు సృష్టిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వంద్ అన్నారు. శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి అనుకూలంగా ఉండే విధంగా చల్‌గల్‌లో 10ఎకరాల స్థలం ఇస్తూ కేబినేట్ ఆమోదం తెలిపినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అదికారులు తలొగ్గవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు పాఠశాలల్లో సౌకర్యాలు వద్దా? అని ప్రశ్నించారు. వేరే జిల్లాల్లో కేవీకి పది ఎకరాల స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి జగిత్యాలలో ఐదు ఎకరాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు పాస్‌పోర్టు సేవా కేంద్రం కూడా మంజూరైందని త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అద్యక్షుడు యాదగిరి బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్


