జగిత్యాలక్రైం: మల్యాల మండలం గొర్రెగుండంలో పట్టా భూ మిలో 201 టేకు చెట్లు నరికివేసేందుకు అనుమతి తీసుకుని 211 చెట్లు నరికివేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా అట వీశాఖ అధికారి రవిప్రసాద్ తెలిపారు. గొర్రెగుండంలోని పట్టా భూమిలో 201 టేకుచెట్లు నరికివేసేందుకు అనుమతి తీసుకున్నారు. యజమాని నుంచి జీపీఏ చేయించుకొని ఓ వ్యక్తి 211 చెట్లు నరికారు. దీంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతనెల 28న విచారణ చేసి నివేదిక తయారుచేశారు. అనుమతి కంటే 10 చెట్లు నరికాడని, నరికిన చెట్లను కూడా పట్టా భూమిలో ఉంచకుండా ఇతర ప్రాంతాల్లో నిల్వ చేశారని తేలిందన్నారు. ఒబులాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ బీట్ ఆఫీసర్ గోపాల్‌లు విచారించి స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లు
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు బస్టాండ్ సమీపంలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఇళ్ల ముందు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో ఐదు ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, స్వీచ్‌బోర్డులు కాలిపోయాయి. గతంలో కూడా ఇలాగే హైటెన్షన్ వైరు తెగిపడడంతో పలు గృహోపకరణాలు కాలిపోయినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు. ఇండ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ లైన్లను తొలగించాలని స్థానికులు కోరారు.


