నానోపై ఆసక్తి చూపని అన్నదాత | - | Sakshi
Sakshi News home page

నానోపై ఆసక్తి చూపని అన్నదాత

Jul 3 2026 11:56 PM | Updated on Jul 3 2026 11:56 PM

మంథనిరూరల్‌: పంటలకు యూరియా కన్నా నానో యూరియా లిక్విడ్‌ ఎంతోమంచిదని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు సూచిస్తున్నా రైతుల్లో ఇంకా నమ్మకం కలగడం లేదు. చీడపీడలు, తెగుళ్లను తట్టుకుని దిగుబడి పెంచే నానోపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఏడాది నుంచి కొంత వరకు యూరియా కొరత తలెత్తుతుండడంతో ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగంలోకి తీసుకొస్తున్నారు. అక్కడక్కడా కొందరు వినియోగిస్తున్నా ఫలితాలు ఆలస్యంగా వస్తుండటంతో అన్నదాతలు అటువైపు మొగ్గు చూపడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నానో యూరియా బెటర్‌ అని వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా

జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 2.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాకు దాదాపు 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 25వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. యూరియా కొంత కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడుకునే అవకాశం ఉందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ఆలస్యంగా ఫలితాలు రావడంతో..

సాధారణంగా పంటకు ఎరువులు, పురుగుల మందులు వేసిన వెంటనే ఫలితం చూపిస్తేనే వాటిని వాడుతుంటారు. అయితే వరిలో యూరియా చల్లిన మరుసటి రోజునే పైరు పచ్చబడి ఫలితం చూపిస్తుంది. కానీ నానో యూరియా పిచికారీ చేశాక రెండు, మూడు రోజుల తర్వాతనే ఫలితం కనిపిస్తోంది. దీంతో రైతుల నానో యూరియాపై ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నానో యూరియాను సాయంత్రం వేళలో పంటపై పిచికారీ చేయాలని, మధ్యాహ్న సమయంలో చేస్తే ఎండ తీవ్రతకు ఫలితం చూపించదని, దీంతోనే రైతులు మొగ్గు చూపడం లేదంటున్నారు.

నానో యూరియాతో ప్రయోజనాలు

● అన్ని పంటలకు నత్రజనిని సమర్థవంతంగా అందిస్తుంది.

● పిచికారీతో ఎక్కువ పత్రహరితం, మెరుగైన కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యంలో దిగుబడి పెరుగుతుంది.

● అనుకూల పరిస్థితుల్లో పోషక వినియోగ సామర్థ్యం కన్నా ఎక్కువగా ఉంటుంది.

● యూరియా బస్తా కన్నా నానో యూరియా తక్కువ ధరకు లభిస్తుంది. చీడ పీడల తెగుళ్ల ఉధృతిని తట్టుకుంటుంది.

అవగాహన కల్పిస్తున్నాం

గ్రామాల్లో నానో యూరియా వాడకం పెంచేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నానో యూరియా పిచికారీ విధానం, ఏ పంటపై ఏ దశలో పిచికారీ చేయాలో, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. అయితే యూరియాతో వెంటనే ఫలితం కనిపిస్తుంది. నానో యూరియా వాడితే రెండు, మూడు రోజుల తర్వాత ఫలితం వస్తుంది. దీంతో రైతులు కొంత మేర వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడుతున్నారు.

– శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఆలస్యంగా ఫలితాలు.. కరువైన ఆదరణ

మంచి ఫలితాలు ఉంటాయంటున్న అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement