వేములవాడ: ఓటరు ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ఫారమ్స్ ఎలా నింపాలో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. చిన్నపాటి పొరపాట్లతో ఓటుహక్కు కోల్పోవాల్సి వస్తోందేమోనని ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అయితే వేములవాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఒక్క పత్రం, మరికొన్ని గ్రామాల్లో రెండేసి ఫామ్స్ ఇస్తుండడంతో అయోమయానికి గురవుతున్నారు.
అవగాహన లేక ఆందోళన
ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను పంపిణీ చేస్తున్న సిబ్బంది వాటిని ఎలా భర్తీ చేయాలో తెలపడం లేదని ప్రజలు వాపోతున్నారు. నమోదు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేయాలని కోరుతున్నారు. అదనపు సిబ్బందిని నియమించి వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు
● ఫారం ఎలా నింపాలో అవగాహన లేకపోవడం.
● అవసరమైన పత్రాలపై స్పష్టత లేకపోవడం.
● వృద్ధులు, మహిళల్లో కొందరికి చదువు రాకపోవడం.
జనం డిమాండ్లు ఇవీ..
● బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు ఫారమ్స్ నింపే బాధ్యత అప్పగించాలి.
● ప్రతి మీసేవ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి.
● గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలి.
ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించని అధికారులు
ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన సిబ్బంది
ఎలా నింపాలో తెలియక అయోమయం
అవగాహన లేక ఆందోళన
వీరు వేములవాడకు చెందిన చిట్టి రామారావు–కుమారి దంపతులు. 35 ఏండ్ల క్రితం ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వేములవాడలో ఆటోమొబైల్ దుకాణం నడుపుతున్నారు. గత 35 ఏండ్లుగా జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2002 ఓటర్ల జాబితాలో కుమారి పేరు ఉండగా, భర్త రామారావు పేరు గల్లంతైంది. బీఎల్‌వో, బీఎల్‌ఏల వద్దకు నాలుగుసార్లు వెళ్లినా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. వీరితోపాటు నివాసముండే లింగేశ్వర్‌రావు–పార్వతి దంపతుల్లో లింగేశ్వర్‌రావు పేరు గల్లంతైంది. చనిపోయిన లింగేశ్వర్‌రావు తల్లి పేరు మాత్రం ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెటిలర్స్ చాలా మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారు.


