● రెండు రోజుల్లో 8 మందిపై దాడి
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విద్యానగర్, భవానినగర్‌లో వీధి కుక్కల దాడిలో రెండు రోజుల్లో 8 మంది గాయపడ్డారు. గురువారం నాలుగేళ్ల హేమచంద్ర, పిట్టల మాధురి (30), కూర వీరమ్మ(45), ఎరుకల రాజమ్మ(60), శుక్రవారం మహమ్మద్ రజాక్(55), రాములు(38), నాగుల సత్యం(26)లను కరిచాయి. వీరందరిని కో–ఆప్షన్ సభ్యులు పీర్ మహమ్మద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యానగర్‌లో రాజమ్మ తన ఇంటి ముందు కూర్చోగా.. మనవరాలిపై కుక్క దాడికి యత్నించగా అడ్డుకోబోయింది. దీంతో కుక్క ఆమెను కరిచింది.
ఉపాధి వేటలో సౌదీకి.. శవపేటికలో ఇంటికి
● 11 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన దాసు
● సుద్దాలలో విషాదం
కోనరావుపేట(వేములవాడ): స్వగ్రామంలో ఉపాధి లేక భార్య, పిల్లలను సౌదీ బాట పట్టిన వలస జీవి 11 ఏళ్ల తర్వాత శవపేటికలో తిరిగివచ్చాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన దొబ్బల దాసు(46) 11 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. ఒక్కసారి కూడా స్వగ్రామానికి రాలేదు. తల్లి, కూతురి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డబ్బాంతా వారి వైద్య ఖర్చులకే సరిపోవడం లేదు. దీంతో అప్పులు తీర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఈక్రమంలో గత జూన్ 17న గదిలో ఉండగా చాతిలో నొప్పి వస్తుందని స్నేహతులకు తెలపగా.. వారు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి తల్లి రత్నమ్మ, భార్య లక్ష్మి, కూతురు కీర్తన, కొడుకు ప్రసన్నకుమార్ ఉన్నారు. దాసు దహన సంస్కారాలకు చందాలు పోగు చేశారు.


