చూస్తే నోరూరే.. తింటే రోగాలే! | - | Sakshi
Sakshi News home page

చూస్తే నోరూరే.. తింటే రోగాలే!

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

● ‘సాక్షి’ కథనంపై వ్యాపార వర్గాల్లో చర్చ ● కలెక్టర్‌ ప్రత్యేకంగా ఆరా డెయిరీల్లో ఏం జరుగుతోంది?

కల్తీ ఆహారంపై సమాచారమివ్వండి

మీరు తీసుకుంటున్న ఆహారం భద్రమేనా?

ప్రమాణాలు పాటించని ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీలు

ఇష్టానుసారంగా పుట్టుకొస్తున్న పరిశ్రమలు

పసిపిల్లల స్నాక్స్‌ రూపంలో రూ.లక్షల దందా

లాభాల కోసం వ్యాపారుల అడ్డదారులు

దాడులు తీవ్రతరం చేస్తాం: ఫుడ్‌ సేఫ్టీ విభాగం

డేంజర్‌
డ్రైనేజీలు

ముంబైలో భారీ వర్షాలకు ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. ఇప్పుడిప్పుడే కరీంనగరాన్ని వరుణుడు ముద్దాడుతుండగా.. మున్ముందు కురిసే భారీ వర్షాలతో మనమూ.. డ్రైనేజీ డేంజర్‌లో ఉన్నామనే సంకేతాలిస్తోంది. చిన్నవానకే నగరంలోని రోడ్లు చెరువును తలపిస్తుండగా.. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. జనసంచారం ఉన్న చోట డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుని ఉండగా.. భారీ వర్షం కురిస్తే ఎక్కడ ఏ గొయ్యి ఉందో చూసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీలపై రక్షణ చర్యలు లేకపోగా.. భారీ వర్షాలకు పొంగిపొర్లే సమయంలో ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాంనగర్‌, మంకమ్మతోట, హౌసింగ్‌బోర్డుకాలనీ, కోర్టు ఏరియా, ఎస్సారార్‌ కాలేజీ

రోడ్డుతో పాటు మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో డ్రైనేజీలు ప్రమాదకరంగా ఉండగా.. పాలకులు సమస్య పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

కరీంనగర్‌ అర్బన్‌: పాల డెయిరీల్లో నాణ్యత దేవుడెరుగు కల్తీ రాజ్యమేలుతోందని తెలుస్తోంది. రైతులను బూచిగా చూపుతూ విచ్చలవిడిగా యూరియాతో పాలు తయారు చేస్తున్నారని స్పష్టమవుతోంది. శుక్రవారం ‘సాక్షి’లో ‘డెయిరీకి యూరియా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రైతుల పొలాలకు చేరాల్సిన యూరియా పలువురి హోల్‌సేల్‌ డీలర్ల అక్రమ వ్యవహారంతో పాల డెయిరీలకు చేరిందని ప్రస్తావించగా, జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నాణ్యతతో పాల వ్యాపారం జరుగుతుందని సుద్దులు చెప్పే వ్యాపారులు మరి యూరియా బస్తాలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యూరియా వ్యవహారంపై కలెక్టర్‌ చిత్రామిశ్రా తీవ్రంగా పరిగణించారని సమాచారం. హోల్‌సేల్‌ డీలర్ల యూరియా నిల్వలు, విక్రయాలపై సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది. యూరియా అక్రమ రవాణాపై ‘సాక్షి’లో కథనం రావడంపై మీడియాకు ఎవరు సమాచారమిచ్చారని అంతర్గతంగా ఆరా తీస్తూ అనుమానితులను కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఎవరికేం కాదు తానే అన్నీ చూసుకుంటానని, ఓ అధికారి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డీఏపీ కృత్రిమ కొరతపై కలెక్టర్‌ ఆరా తీయగా ఎక్కడా కొరత లేకుండా, ఎంఆర్‌పీ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖను ఆదేశించినట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

జిల్లాలో కల్తీ ఆహారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కల్తీ హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు అయితే బాధితులు వందల్లో ఉంటారు. కానీ, ఆహార పదార్థాలు తయారుచేసి ప్యాక్‌ చేసి విక్రయించే పరిశ్రమలు వేలాదిమందికి విషాహారం పంచిపెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా రామడుగు మండలం దేశ్‌రాజ్‌పల్లిలో నిర్వహించిన దాడిలో పెద్దఎత్తున కల్తీ పదార్థాలు పట్టుకోగా.. రెడీమేడ్‌ ఆహార పదార్థాల వినియోగంలోని ప్రమాదాన్ని చాటిచెప్పింది. గతంలో కల్తీ కారం, టీపొడి, పసుపు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ల పరిశ్రమలపై దాడులు జరగగా.. మిల్‌మేకర్‌ వంటి ప్రీమియం బ్రాండ్ల రూపంలో చలామణి అవుతున్న పలు ఉత్పత్తుల నాణ్యతపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇదే సమయంలో జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రమాణాలు పా టిస్తూ.. ఓపెన్‌ కిచెన్‌లో వంట చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. మిగిలిన వాటిలో కిచెన్‌ వైపు తొంగిచూడకపోవడమే నయం.

పుట్టగొడుగుల్లా.. పిల్లల ఉత్పత్తులు

కరీంనగర్‌ శివారులో తయారవుతున్న పలు తినుబండారాల ఉత్పత్తుల్లో పిల్లలను లక్ష్యం చేసుకుని సాగుతున్న దందా చాలాపెద్దది. రోజూ రూ.లక్షల్లో ఈ వ్యాపారం సాగుతుంది. ఉదయం తినే బ్రెడ్‌ దగ్గర నుంచి స్నాక్స్‌, చిప్స్‌, చాక్లెట్లు, స్వీట్లు తయారు చేసి విక్రయిస్తున్న పలు కంపెనీలు ప్రమాణాలు పాటించడం లేదు. ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంస్థ అనుమతి తీసుకుంటున్నా ఆ మేరకు ఆహార ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు జరిపిన ప్రతీసారి బయటపడుతూనే ఉంది. అనేక రకాల ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌లో పరిశ్రమలు అనుమతి లేని కలర్‌ ఏజెంట్లు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కల్తీ నూనెలు వాడుతున్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో పిల్లలకు జీర్ణాశయ సమస్యలతోపాటు, కిడ్నీ, కేన్సర్‌ వంటి రోగాలకు కారణమవుతాయని తెలిసినా.. ఫుడ్‌సేఫ్టీ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్ల వీరి వ్యాపారం వర్థిల్లుతోంది. ముఖ్యంగా బేకరీల్లోని కేకుల్లో వాడే కలర్‌ ఏజెంట్లు కేన్సర్‌ కారకాలని తెలిసినా వాటి వినియోగంపై నియంత్రణ లేకపోవడం దురదృష్టకరం.

గతేడాది నుంచి 350 దాడులు

మరోవైపు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గతేడాది అక్టోబరు నుంచి జూన్‌ వరకు దాదాపు 350 దాడులు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీటు షాపులు ఉన్నాయి. వీటిలో 100వరకు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపగా అందులో 20వరకు శాంపిళ్లలో పూర్తిగా నాణ్యత లోపించిందని అధికారులు తెలిపారు. వీరిలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ 13 మందికి రూ.5 లక్షల జరిమానా విధించి కొరడా ఝుళిపించడం గమనార్హం.

జిల్లాలో పలుచోట్ల ఆహార ఉత్పత్తుల కల్తీపై మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. మీరు కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్‌ లేదా ఇతర ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించకండి. వెంటనే మాకు 70320 87727 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించండి. మున్ముందు కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై దాడులను మరింత ముమ్మరం చేస్తాం.

– రోహిత్‌రెడ్డి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

కల్తీ ఆహారమా.. ఫిర్యాదు చేయండి

70320 87727

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement