నియోజకవర్గ అభివృద్ధికి రూ.22వేల కోట్లు | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి రూ.22వేల కోట్లు

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

అందులో రోడ్ల కోసమే రూ.10వేల కోట్లు

వారంలో నగరంలో యూఐడీఎఫ్‌ పనులు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.22 వేల కోట్లు తీసుకువచ్చానని, అందులో రూ.10 వేల కోట్లు రోడ్ల కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. నగరపాలకసంస్థ 37వ డివిజన్‌ గాయత్రీ నగర్‌లో రూ.77 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు షాషామహాల్‌ వద్ద ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మరోవారం రోజుల్లో రూ.50 కోట్ల యూఐడీఎఫ్‌ నిధులతో అభివృద్ధి పనులను నగరంలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల్లో అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) పథకం కింద రూ.840 కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, ఇక అక్కడ చెత్త నిల్వ ఉండదన్నారు. హుజూరాబాద్‌లో డంప్‌యార్డ్‌కు తాము వ్యతిరేకమన్నారు. నగరంలో పార్కింగ్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.25 కోట్లతో మల్టిలెవెల్‌ పార్కింగ్‌ను నిర్మిస్తున్నామన్నారు. త్వరలో కరీంనగర్‌, జగిత్యాల హైవే పనులు ప్రారంభిస్తామని, గన్నేరువరం బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. యూసీఎఫ్‌ నిధులపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్ట్‌లను మాత్రమే యూసీఎఫ్‌లో ఎంపిక చేశారని, రెండేళ్ల తరువాత తాము కరీంనగర్‌కు చోటు కల్పించామన్నారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, స్థానిక కార్పొరేటర్‌ కేఏపీపీ చంద్ర పాల్గొన్నారు.

మహిళలకు మోదీ కానుక

తిమ్మాపూర్‌: దుర్గాబాయ్‌ మహిళా ప్రాంగణంలో ఇటీవల కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కేంద్రమంత్రి బండి సంజయ్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వ ‘మోదీ కానుక’ కార్యక్రమం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మహిళలకు విడతలవారీగా ఆటోలు అందిస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement