ముత్తారం: మండలంలోని మల్యాల లక్ష్మీ దేవేందర్ వార్డు మెంబర్ ఇంటి ఎదుట రోజులుగా చేస్తున్న క్షుద్ర పూజలు గురువారం కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారు జామున నిమ్మకాయలు పెట్టడంతో పెంపుడు కుక్క అరవడంతో వెనుదిరిగారు. మరుసటి రోజు పెంపుడు కుక్క అరవకుండా చేసి వెంట్రుకలు వీరబోసిన మట్టితో తయారు చేసిన మూరేడు బొమ్మ కనిపించడంతో కుటుంబసభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని దేవేందర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. క్షుద్రపూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు ఎస్సైని కోరారు. గ్రామ సర్పంచ్ సుదాడి రవీందర్‌రావు, పోలీసులు పోచమ్మను కొలిచే రవిని పిలిపించి తీయించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
జగిత్యాలలో..
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో నడి రోడ్డుపై క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, బొమ్మ, జీడిగింజలు, అన్నంతో తయారు చేసిన ముద్దలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఉదయం చూసిన ప్రజలు భయాందోళన చెందారు.


