సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. శివారులోని కార్గిల్‌లేక్ చెరువులో గురువారం మృతదేహం తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి బయటకు తీయించారు. మృతుడి వద్ద వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సుమారు 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉంటాడని, టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని సిరిసిల్ల మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.
గోదావరిలో మృతదేహం లభ్యం
మంథని: మంథని వద్ద గోదావరి నదిలో ఆసంపల్లి కొమురయ్య(50) మృతదేహం గురువారం లభ్యమైంది. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపాదకాలనీకి చెందిన కొమురయ్య బుధవారం గోదావరినదికి స్నానం కోసమని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం వెతుకగా నదిలో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కొమురయ్య కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిమ్మాపూర్: మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు ఒప్పంద ప్రతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంజలి తెలిపారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని, ఈనె 8న తిమ్మాపూర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో ఉదయం 10 గంటలు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పెట్టుబడుల పేరిట రూ.7కోట్ల మోసం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుబడుల పేరుతో సుమారు 100 నుంచి 110 మంది బాధితుల నుంచి రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు సేకరించి, మోసానికి పాల్పడిన మొలుగూరి సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రారంభంలో లాభాలు చెల్లించి, అనంతరం భారీగా పెట్టుబడులు సేకరించిన సురేశ్, ఫారెక్స్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కొత్త పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న డబ్బుతో పాత వారికి చెల్లింపులు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.


