న్యూస్‌రీల్
వాన కురవక.. పనులు సాగక
చినుకు కురవక రైతు గుండెల్లో వణుకుపుడుతోంది. సాగు పనులు మొదలుకాక పొలాల వద్ద అన్నదాతలు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నారు. మహిళా కూలీలు వ్యవసాయ పనుల కోసం ఆరా తీస్తున్నారు. అడపా.. దడపా పడుతున్న వాన భూమికి పదనివ్వకపోగా.. యాసంగిలో కోసిన వరి మొదళ్లు దుక్కిదున్నకపోవడంతో వెక్కిరిస్తున్నాయి. కచ్చరానికి కట్టేసిన కాడెడ్లు నెమరువేసుకుంటూ నాగళ్ల సందడి కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నో ఆశలతో పోసిన వరినారు ఎదుగుతుండగా.. నెర్రెలుబారిన నేల చినుకు కోసం నిరీక్షిస్తోంది. పక్షం రోజుల క్రితం వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోగా.. సాగుచేసిన భూమి ఎడారిని తలపిస్తోంది. వర్షాలు లేక సాగురంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. పంటలతో కళకళలాడాల్సిన భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఈ చిత్రాలు గంగాధర మండలంలో కన్పించగా వరుణుడు కరుణిస్తేనే కాడి సాగనుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
నారుమడికి నెర్రెలు: నీరులేక నెర్రెలుబారిన నాడుమడి
దుక్కికి దిక్కేది: వర్షాలు లేక బీడువారిన పొలం
చినుకు పడితేనే: వ్యవసాయ భూమిలో మొలకెత్తని పత్తి


