డెయిరీకి యూరియా! | - | Sakshi
Sakshi News home page

డెయిరీకి యూరియా!

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

ఫిర్యాదు నంబర్లేవి.. అవగాహనేది

జిల్లాలో భారీగా పక్కదారి?

డెయిరీల్లో కుప్పలుగా నిల్వలు

హోల్‌సేల్‌ వ్యాపారే సూత్రధారి

డీఏపీకి కృత్రిమ కొరత

తనిఖీలు నామమాత్రమే?

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలో రాయితీ యూరియా పక్కదారి పడుతోంది. ఓ అధికారి, హోల్‌సేల్‌ డీలర్‌, పలువురు ఫర్టిలైజర్‌ దుకాణదారుల తీరుతో బ్లాక్‌ మార్కెట్లో యూరియా నిల్వలు పేరుకుపోతుండగా అధికారుల కళ్లకు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, అసలు సదరు యూరియా ఉత్పత్తి అయి ఎన్ని రోజులవుతోంది, తాజాగా వచ్చిందా.. గతంలోదా అన్నది తేల్చేందుకు అవకాశమున్నా.. తదనుగుణ చర్యలు శూన్యం. పాల డెయిరీల్లో భారీగా యూరియా నిల్వలుండగా, హోల్‌సేల్‌ వ్యాపారే ఒక్కో బస్తాకు రూ.600కు విక్రయించాడని తెలుస్తోంది.

డెయిరీలు, దాణా తయారీ కేంద్రాల్లో భారీ నిల్వలు

పాల డెయిరీలు, పశువుల దాణా, కోళ్ల దాణా తయారీ చేసే కేంద్రాల్లో పెద్దమొత్తంలో యూరియా నిల్వలున్నట్లు సమాచారం. చిన్న డెయిరీల నుంచి బడా డెయిరీల వరకు అక్రమ మార్గంలో యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. పాల ఉత్పత్తిలో ఇది కీలకం కాగా, నేరుగా కంపెనీల నుంచి కొనాల్సిందిపోయి రైతుల పేరిట భారీ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో పాల డెయిరీలు, పశువుల దాణా, కోళ్ల దాణా తయారు చేసే పరిశ్రమలున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం కరవవడంతో దందా నిరాటంకంగా సాగుతోంది. సీజన్‌ వచ్చిందంటే చాలు ముందస్తు ప్రణాళికలతో సఫలీకృతులవుతున్నారు. ఏళ్లుగా ఈ దందా సాగుతుండగా పలువురు అధికారులకు ముడుపులు ముడుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కరీంనగర్‌కు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారి నుంచే వేల బస్తాలు వ్యవసాయేతర రంగాలకు చేరినట్లు ప్రచారం.

నగదే కావాలట

యూరియా వ్యాపారులకు వరంగా మారుతోంది. సాగురంగం ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుండగా పత్తి వేసిన రైతులు యాప్‌లో నమోదు చేసుకుని కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. బస్తా కావాలంటే నానో యూరియాతో పాటు కాంప్లెక్స్‌ ఎరువులు తీసుకోవాల్సిందేనని తెగేసి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 55వేల ఎకరాల్లో పత్తి, 1.75లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారుల అంచనా. మొదటి దశలో ఎకరానికి బస్తా యూరియా చొప్పున 2.05లక్షల యూరియా బస్తాలు అవసరం. ఇదే వ్యాపారులకు అవకాశంగా మారుతోంది. చాలామంది వ్యాపారులు అధిక ధరలు అమ్మే విషయం బయటపడకుండా యూపీఐ చెల్లింపులు వద్దంటూ నగదు మాత్రమే తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు.

అదనంగా రూ.100 వసూలు

యూరియా బస్తాకు రూ.266 ధర నిర్ణయించగా వ్యాపారులు రూ.350 నుంచి 400 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారుల వద్ద ఎరువులు తీసుకుంటేనే తర్వాత అప్పు కింద పిచికారీ మందులను ఇస్తున్నా రు. కాదని సహకార సంఘం, ఇతరుల వద్ద ఎరువులు కొనుగోలు చేస్తే మిగతా మందులు ఇవ్వడం లేదని, చేతిలో నగదు లేక వారి వద్దనే అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాగా వ్యాపారులు డీఏపీకి కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను పిండేస్తుండగా అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్రస్థాయిలో టోల్‌ ఫ్రీ ఫిర్యాదు నంబర్‌ 89777 41771 ఉండగా దానిపై అవగాహన రైతులకు శూన్యం. వ్యాపారులు కేవలం రాష్ట్రస్థాయి నంబర్‌ను మాత్రమే ప్రదర్శిస్తుండగా పలు దుకాణాలు నిబంధనలను విస్మరిస్తున్నాయి. రైతు వేదికలే వేదికగా ప్రచారం చేయాల్సి ఉండగా తదనుగుణంగా అవగాహన కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక జిల్లాస్థాయిలో ఫిర్యాదు నంబర్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసే లేదని తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement