కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అన్నా అక్క మెంటర్‌షిప్’ ఏఐ, డిజిటల్ లెర్నింగ్ టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను కరీంనగర్‌లోని ధన్గర్‌వాడీ పాఠశాలలో గురువారం ఎస్సారార్ కళాశాల ప్రిన్సి పాల్ కల్వకుంట రామకృష్ణ ప్రారంభించారు. ఎస్సారార్ కళాశాలకు చెందిన 5వ సెమిస్టర్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్‌పై మార్గదర్శనం చేస్తారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.ప్రమోద మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఏఐ టూల్స్‌పై మార్గదర్శనం చేయడం అభినందనీయమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, కా మర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ సురేందర్ రెడ్డి, నోడల్ అధికారులు మధు, రాజేశ్ పాల్గొన్నారు.
4న మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ పాలిసెట్–2026 ఫేజ్ 1, 2, ఇంటర్నల్ స్లీడింగ్ అనంతరం మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభా రాణి తెలిపారు. స్పాట్ అడ్మిషన్‌లో సీట్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వెంటనే మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.5,080 చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పా ట్ అడ్మిషన్ పొందినవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వర్తించవని తెలిపారు.
డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఇవ్వాల్సిందే
కరీంనగర్ అర్బన్: డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఇవ్వాల్సిందేనని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చాంబర్‌లో డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వందశాతం బియ్యం, 25శాతం పెనాల్టీ వసూలు, రబీ 2022–23లో వేలం వేసిన వడ్ల రికవరీపై సమీక్షించారు. బాకీ ఉన్న బియ్యం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వాలని మిల్ల ర్లను ఆదేశించారు. విస్మరిస్తే చట్టపరమైన చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం. రజనీకాంత్, డీఎస్వో నర్సింగరావు, సివిల్ సప్లయ్ డీటీలు సురేందర్, ఖాజా, అన్వర్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు సేవ అదృష్టం
కరీంనగర్‌టౌన్: దివ్యాంగ పిల్లలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని, వారికి సదుపాయాలు సకాలంలో అందేలా చూడాలని డీఈవో ఎన్.ప్రశాంత్‌రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని ధన్గర్‌వాడీ పాఠశాలలోని భవిత కేంద్రంలో గురువారం విలీన విద్యా రిసోర్స్ సమీక్ష నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ భవిత కేంద్రానికి రాలేని పిల్లల కోసం ప్రతీ శనివారం ఇంటి వద్దకే వెళ్లి బోధన చేయాలని సూచించారు. కోఆర్డినేటర్ డి.శ్రీనివాస్, ఈఈఆర్పీలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్‌టౌన్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులు ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా ఈనెల 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కరీంనగర్‌లోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


