శిశువుల పాలిట సికిల్‌సెల్‌ | - | Sakshi
Sakshi News home page

శిశువుల పాలిట సికిల్‌సెల్‌

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

నిర్లక్ష్యం చేయవద్దు

తొమ్మిది నెలల్లో జిల్లాలో 128 మంది బాధితుల గుర్తింపు

హెచ్‌పీసీఎల్‌ పరీక్షలతో పుట్టబోయే శిశువులకు రక్షణ

3 నుంచి 5 నెలల గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు

అవయవ లోపాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స

గర్భిణులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యులు

కరీంనగర్‌: వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధిత జన్యు లోపాల్లో ‘సికిల్‌సెల్‌’ అత్యంత ప్రమాదకరమైంది. సికిల్‌సెల్‌తో తరచూ రక్తహీనత (అనీమియా), కీళ్లు, ఎముకలు, చాతీలో నొప్పులు, ఇన్‌ఫెక్షన్లు, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, ప్లీహం, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాల పై ప్రభావం, హార్ట్‌ స్ట్రోక్‌, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులిద్దరిలోనూ సికిల్‌సెల్‌ జన్యు వు ఉంటే, పుట్టే బిడ్డకు వ్యాధి వచ్చే అవకాశముంటుంది. ఈ వ్యాధి ప్రభావం భవిష్యత్‌ తరాలపై పడకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లాలోనే 128 మంది సికిల్‌సెల్‌ బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

3 నుంచి 5 నెలలలోపే పరీక్షలు

సికిల్‌సెల్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భం దాల్చి న 3 నుంచి 5 నెలల వ్యవధిలో ఉన్న మహిళలందరికీ తప్పనిసరిగా ‘హెచ్‌పీఎల్‌సీ’ రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా రక్తంలో సికిల్‌సెల్‌ జన్యువుల ఉనికిని స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఈ ప్రక్రియ 2025 అక్టోబర్‌లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 128మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.

అవయవ లోపాల ముప్పు

సికిల్‌సెల్‌ పాజిటివ్‌ వచ్చిన గర్భిణుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, వారికి జన్మించే పిల్లలు తీవ్రమైన అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడి పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం, అంతర్గత అవయవాలు దెబ్బతినడం, తరచూ తీవ్రమైన నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో పనిచేస్తోంది. సికిల్‌సెల్‌ బాధితులకు జన్మించే పిల్లలకు ఎలాంటి అవయవ లోపాలు రాకుండా ఉండేందుకు గర్భధారణ సమయం నుంచే ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా మందులు, అవసరమైన జన్యు సలహాలు ఇస్తూ పుట్టబోయే బిడ్డల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు.

గర్భిణులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సూచించిన సమయంలో హెచ్‌పీఎల్‌సీ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో సికిల్‌సెల్‌ పాజిటివ్‌ ముందస్తు నిర్ధారణ చేసినట్లయితే సరైన వైద్యంతో వ్యాధి ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. సికిల్‌సెల్‌ ప్రభావం ఉన్న పిల్లల్లో రక్తహీనత, తరచూ నొప్పులు, ఇన్‌ఫెక్షన్లు, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.

– డాక్టర్‌ ఎం.సుధ,

అడిషనల్‌ డీఎంహెచ్‌వో, కరీంనగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement