సిటీకి మరో రూ.1,150 కోట్లు! | - | Sakshi
Sakshi News home page

సిటీకి మరో రూ.1,150 కోట్లు!

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● ‘అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌’లో ఎంపికకు యత్నం ● ప్రతిపాదన అమలైతే అభివృద్ధి జాతర ● నేడు బల్దియా అత్యవసర సమావేశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేయనున్న అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (సీయూఎఫ్‌)పథకంలో కరీంనగర్‌ నగరాన్ని చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, న గరపాలకసంస్థ భాగస్వామ్యం కలిగిన ఈ పథకంలో ఆమోదం లభిస్తే సుమారు రూ.1150 కోట్ల నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర నెలకొననుంది. ఈ పథకం నిధుల్లో ఎక్కువ భాగం నగరపాలకసంస్థయే భరించాల్సి ఉండగా...ఆస్థాయిలో ఆదాయాన్ని ఎలా సృష్టించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌..

నగరపాలకసంస్థ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడం, ప్రభుత్వాల నుంచి పెద్దగా నిధులు రాకపోవడం నగర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప నగర అభివృద్ధి అనుకున్న మేర సాగే అవకాశం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలకు నిధులు కేటాయించే ఈ పథకానికి, ఐదు సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్లు కేటాయించింది. పట్టణాల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈనెల 11వ తేదీలోగా ఆయా మున్సిపల్‌ పాలకవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది.

బల్దియాపైనే భారం...

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలకసంస్థ భాగస్వామ్యంగా ఉంటాయి. ఎంపికై న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు నేరుగా ఇస్తుంది. మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం లేదా నగ రపాలకసంస్థ వాటా ఉంటుంది. మిగతా 50 శాతం నిధులు నగరపాలక సంస్థ బాండ్లు, బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా సమీకరించుకోవాలి. అంటే అధిక బాధ్యత బల్దియాపైనే

ఉంది.

రూ.1,150 కోట్లతో ప్రతిపాదనలు

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ స్కీంలో భాగంగా రూ.1150 కోట్లతో నగరపాలకసంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సుమారు రూ.650 కోట్లతో నగరంలో రో డ్లు, డ్రైనేజీల ని ర్మాణం, మిగతా నిధులతో డంప్‌యార్డ్‌, ఎస్‌టీపీ, ఆదాయం వచ్చే వాణిజ్య భవనాలు, సుందరీకరణ, పర్యాటకానికి కేటాయించనున్నారు. బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి డి.తారా మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నగరం నుంచి రావాల్సిన ప్రణాళికలు, ప్రతిపాదనలపై చర్చించారు. కరీనగర్‌ నుంచి మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ పాల్గొన్నారు.

అమలైతే.. అద్భుతమే..

సీయూఎఫ్‌ పథకం సాఫీగా అమలైతే కరీంనగర్‌ సిటీ స్వరూపమే మారిపోనుంది. గతంలో స్మార్ట్‌ సిటీలో నగరం ఎంపిక కావడంతో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి జరగడం తెలిసిందే. అయినప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు తదితర సమస్యలు అలానే ఉన్నాయి. సీయూఎఫ్‌ పథకం ఆచరణకు నోచుకొంటే నగర రూపురేఖలు మారిపోనున్నాయి.

నేడు అత్యవసర సమావేశం

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌లో ఎంపిక చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మాణం పంపించేందుకు గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నగరమేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రూ.1150 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి, యూసీఎఫ్‌లో నగరపాలకసంస్థను చేర్చాలని కోరుతూ తీర్మానించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement