యూరియా వాడకంపై కేంద్ర ప్రభుత్వం సునిశిత పరిశీలనకు ఆదేశించింది. గత యాసంగి కన్న ఈసారి యూరియా వాడకం విపరీతంగా పెరిగింది. ఈక్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి తదనుగుణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖను అలర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయితే యాప్ ద్వారా యూరియా కొనుగోళ్లు జరిగినా.. హోల్‌సేల్ దగ్గరి నుంచే పక్కదారి పట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమ చెప్పుచేతల్లో ఉంటారన్న హోల్‌సేల్ డీలర్ల అత్యుత్సాహంతో ఇష్టారీతిగా యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలున్నాయి. మిల్క్ డెయిరీల్లోనూ కుప్పలు తెప్పలుగా వినియోగించారని తెలుస్తోంది.
కరీంనగర్ అర్బన్: అవసరానికి మించి యూరియా వాడకమనేది పోషకాల అసమతుల్యతకు దారి తీయడమే కాకుండా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రతికూలమే. సదరు కారణంతో మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. తరచూ ఎరువు కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పరిశీలించడం.. ఏ డీలర్ల నుంచి కొనుగోలు చేశారు.. ఏ పంటలకు వాడారు.. సాగేతర వాటికి తరలించారా అనే అంశాలను పరిశీలించనున్నారు.
రైతు యూరియాపైనే అక్రమార్కుల కన్ను
రైతులకు రాయితీపై ఇచ్చే యూరియా కిలో రూ.6కే లభిస్తోంది. వ్యవసాయేతర రంగాలు యూరియా వినియోగించాలంటే టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడాల్సి ఉంటుంది. అయితే ఇది మార్కెట్‌లో కిలో రూ.65కు లభిస్తోంది. దీంతో ఇతర రంగాల వ్యాపారులు సబ్సిడీ యూరియాకే మొగ్గు చూపుతున్నారు. అధికారులతో మామూలు బంధాలు నెరుపుతూ పక్కదారి పట్టిస్తుండగా.. మరికొందరు రాజకీయ బలాన్ని చాటుతున్నట్లు తెలుస్తోంది. రాయితీ యూరియాను 15 రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. యాడ్ బ్లూ యూనిట్లు, పశువుల దాణా తయారీ యూనిట్లు, ప్లయ్‌వుడ్, మిల్క్ డెయిరీలు మొదలైన వాటిలో యూరియా వాడుతున్నారు. క్లాజు 25, ఫెర్టిలైజర్(కంట్రోలు) ఆర్డర్ 1985 ప్రకారం వ్యవసాయ యూరియా వేరే పరిశ్రమల్లో వాడకం నిషేధం. అలా వాడే ప్రదేశాలను తనిఖీ చేయడం, చర్యలు తీసుకోవడం చేయాలి. అయితే ఎరువుల కేటాయింపు, పంపిణీ అనేది ఫెర్టిలైజర్ మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్, 1973 ప్రకారం జరుగుతోంది. ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి కేటాయించిన దాన్ని వేరొక చోటుకు డైవర్షన్, రవాణా చేయడం నిషేధం.
అక్రమాలు నిగ్గు తేలేనా..?
యూరియా వినియోగంలో అక్రమాలు వెలుగుచూస్తాయా అన్నది అనుమానమే. తనిఖీ చేసే అధికారులు వారి తప్పులను వారెలా బయటకు చెప్పుకుంటారన్నది ఇక్కడ ప్రశ్న. జిల్లాలో ఎక్కువగా హోల్‌సేల్ డీలర్ల నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఇంటాబయట వినిపిస్తున్న మాట. యాప్ వినియోగంతో కూడా యూరియా అక్రమార్కులకు చేరిందని తెలుస్తోంది. గతంలో సాగు భూములను సర్వే చేసిన వ్యవసాయ శాఖ.. సదరు భూములకు రైతు భరోసా ఇవ్వడం లేదు. కాగా యాప్‌లో అలా లేదని తెలుస్తోంది. పట్టా పాస్‌బుక్‌లో ఉన్న విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపు జరుగుతోంది. అంటే సాగులో లేని భూమికి కూడా యారియా వెళ్లిందన్న మాట.


