● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్‌లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ | - | Sakshi
Sakshi News home page

● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్‌లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్‌లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ

కరీంనగర్‌: ఈనెల 10న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. 4 రోజులుగా కరీంనగర్‌లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్‌లో గ్రామాలవారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు. మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, కంటెస్టెట్‌ కార్పొరేటర్లతోనూ మీటింగ్‌లు నిర్వహించారు. జిల్లాలవారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్లవారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఏకంగా వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని సభకు తరలించాలని నిర్ణయించారు.

నేటి నుంచి సికింద్రాబాద్‌లో మకాం

బండి సంజయ్‌కుమార్‌ గురువారం నుంచి సికింద్రాబాద్‌లోనే మకాం వేయనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభకు సిటీ నుంచే భారీఎత్తున జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్‌ అసెంబ్లీ నేతలతో బర్కత్‌పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement