కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నగరానికి చెందిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియమితులయ్యారు. నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ప్రకటించింది. మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాంను నియమించింది. మాజీ ఎమ్మెల్యే, బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడు శ్రీరాం ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌజ్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్నూరుకాపు సామాజిక కార్యక్రమాలు, సంఘం వ్యవహారాల్లో శ్రీరాం చురుకై న పాత్ర పోషిస్తున్నారు. మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహం చైర్మన్‌గా, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కాగా తన నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాకు తొలి కార్పొరేషన్ పదవి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లకు కరీంనగర్‌కు తొలి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారద నియమితులు కాగా.. సుడా, లైబ్రరీ, ఆర్‌టీఏ తదితర పదవులను భర్తీ చేయడం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలిసారిగా శ్రీరాం ద్వారా కరీంనగర్‌కు వచ్చింది.


