పెద్దపల్లి: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన మెగా జాబ్‌మేళాలో మంత్రి మాట్లాడారు. 77 కంపెనీల్లో 4,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించగా.. 4,156 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 1,500 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేమని అన్నారు. టాస్క్ సెంటర్‌లో శిక్షణ పొందిన వారిలో 261 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్, ఫినిషింగ్ స్కిల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతీఒక్కరు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, డాటా సైన్స్ నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. ప్రభుత్వ విప్ విజరమణారావు మాట్లాడుతూ, ఉత్పత్తుల బ్రాండింగ్ కేంద్రంగా పెద్దపల్లి నిలవాలన్నారు. రెండేళ్లక్రితం పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో శిక్షణ పొందిన 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఖరితోనే నిరుద్యోగ సమస్య పెరిగి, యువకులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.
జాబ్ మేళాకు భారీ స్పందన
మెటీ జాబ్ మేళాకు స్పందన లభించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశ్రమల శాఖ, టాస్క్ సహకారంతో చేపట్టిన మేళాకు 77 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తిగల నిరుద్యోగ యువతకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు సాధించిన వారితో మంత్రి శ్రీధర్‌బాబు, విప్ విజయరమణారావు, ఎంపీ వంశీకృష్ణ
ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మెగాజాబ్ మేళాకు విశేష స్పందన


