మానకొండూర్: రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యామ్నాయ పంటలు ఎంతో ఉపయోగకరమని డీఏవో భాగ్యలక్ష్మీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి కమలాకర్‌రెడ్డి అన్నారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భా గంగా ఉద్యాన పంటల సాగు, ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి, సర్పంచ్ బొట్ల స్వరూప, కె.తిరుపతి, ఉప సర్పంచ్ సతీశ్, స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డీసీవో రామానుజచార్యులు, ఏడీఏ శ్రీధర్, ఏవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
‘సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’
కరీంనగర్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల ను ఖండిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విధానా లపై, ప్రజాసమస్యలపై విమర్శలు ఉండాలి కానీ.. వ్యక్తిగత దూషణలు అనైతికమన్నారు. కేటీఆర్ మాజీ సీఎం చంద్రశేఖర్ రావు కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని పేర్కొన్నారు. బండి సంజయ్ వంటి నాయకులు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు.
కరీంనగర్ టౌన్: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేసిందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో మాట్లాడుతూ వామపక్షాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవమన్నారు. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయమైందన్నారు. రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలు సెప్టెంబర్‌లో కరీంనగర్‌లో నిర్వహించడం జరుగుతుందని, కార్మిక లోకం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికవర్గానికి పితామహుడు, కార్పొరేట్, పెట్టుబడిదారుల గుండెల్లో గునపం లాంటి మహోన్నతమైన వ్యక్తి కారల్ మార్క్స్ అని కొనియాడారు. పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కారల్ మా ర్క్స్ 209వ జయంతిని నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్‌బోస్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, తాండ్ర స దానందం,విశ్వనాథం, సుదర్శన్ పాల్గొన్నారు.
ప్రధానాసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్)లో మంగళవారం విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీజీహెచ్, ఎంసీహెచ్, ఫార్మసీ, స్కానింగ్‌లు, ఆపరేషన్ థియేటర్, ఓపీ, ఐపీ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. రోగుల సంఖ్య, డాక్టర్ల హాజరుపట్టిక, అటెండెన్స్ తీరును పరిశీలించారు. మెడికల్ కళాశాల నుంచి అటెండెన్స్ కాపీలు తెప్పించుకొని పరిశీలించారు. ఆస్పత్రిపై ఏవైనా ఫిర్యాదులు రావడం వల్ల తనిఖీ లు నిర్వహించారా..? లేదా సాధారణ తనిఖీ లా..? అనే అంశంపై సూపరింటెండెంట్ వీ రారెడ్డిని వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సాధారణ తనిఖీలేనని తెలిపారు.
7న అవగాహన సమావేశం
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ఇంధనశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహి స్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 7న ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ‘వ్యవసాయ క్షేత్రాలు– సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అంశంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. రైతులు, రైతు సంస్థలు, సహకార సంఘాలు హాజరుకావాలన్నారు.


