కరీంనగర్‌టౌన్: జిల్లాలో మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను పర్యవేక్షించారు. ఎంతమంది హాజరయ్యారు, ఏయే కంపెనీలకు అవకాశం కల్పించారు.. తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్‌మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తామని, తద్వారా వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన 90 కంపెనీలు నియామక ప్రక్రియను నిర్వహించాయి. మూడు వేల మంది యువత హాజరుకాగా, 997మంది వివిధ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికయ్యారు. మరో 478 మందిని వివిధ కంపెనీలు తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, పరిశ్రమలశాఖ జీఎం సాల్మ న్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.


