చేతకాకపోతే తప్పుకోండి | - | Sakshi
Sakshi News home page

చేతకాకపోతే తప్పుకోండి

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

● రైతులనెందుకు గోస పెడుతన్నారు ● ఖాజీపూర్‌ కొనుగోలు కేంద్రం సందర్శనలో బండి సంజయ్‌ కుమార్‌

కొత్తపల్లి(కరీంనగర్‌)/కరీంనగర్‌: రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అరిగోస పెడుతోందని, కొనుగోళ్లు చేతకావడం లేదని తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌ లో కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కమాన్‌పూర్‌లో రూ.20 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మంజూరైన పనిముట్లను లబ్ధి దారులకు అందజేశారు. సంజయ్‌ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఎంతమంది రైతులు చస్తే స్పందిస్తారని నిలదీశారు. వడ్ల కొనుగోలుకు టోకెన్లు ఇవ్వడానికి దళారులు కమీషన్లు తీసుకోవడం దురదృష్టకరని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మంత్రులను రైతులు కొట్టేలా ఉన్నారన్నారు. 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు వస్తే...ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్‌ టన్నులే కొంటారా? అంటూ మండిపడ్డారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాజీపూర్‌, కమాన్‌పూర్‌ సర్పంచ్‌లు కోమటిరెడ్డి అంజనికుమార్‌, నునుగొండ మానసప్రవీణ్‌, నాయకులు తిరుపతి, రతన్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

మోడీ సభకు వాల్‌ రైటింగ్‌

ఈనెల 10న సికింద్రాబాద్‌లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌ చైతన్యపురిలోని తన నివాసం వద్ద గోడపై వాల్‌ రైటింగ్‌ చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధి సహా కార్యకర్తలంతా తమ తమ డివిజన్లలో మోదీ సభ తేదీ, సమయం, ప్రాంతం తెలిసేలా వాల్‌ రైటింగ్‌తోపాటు వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బండి సంజయ్‌ తోపాటు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, పార్టీ సీనియర్‌ నేతలు బాస సత్యనారాయణ, డీ.శంకర్‌, గుగ్గిళ్లపు రమేశ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి జే.సంగప్ప, బి.ప్రవీణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement