కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ నిధులు రూ.70 కోట్లతో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్‌సీలతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ హాజరయ్యారు. రూ.70 కోట్ల గ్రాంట్‌తో నగరంలోని టవర్‌సర్కిల్ వద్ద మల్టీ పార్కింగ్ భవనం నిర్మించాలని తీర్మానించారు. మదీనాకాంప్లెక్స్ వద్ద గతంలో నిర్మించిన భవనం ఉపయోగంలోకి రాకపోగా, శిథిలావస్థకు చేరడం తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.50 కోట్లతో మల్టీపార్కింగ్ భవనం నిర్మించాలని నిర్ణయించడంతో టవర్‌సర్కిల్ వద్ద పార్కింగ్ తిప్పలు తప్పే అవకాశం ఉంది. ప్రతి వర్షాకాలం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడుతున్న ముంపును నివారించేందుకు నిధులు కేటాయించారు. మంచిర్యాల చౌరస్తా, ముకరాంపుర, రాంనగర్, ఆర్‌టీసీ వర్క్‌షాప్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో వరద ముంపును తప్పించేందుకు నాలా నిర్మాణాలను చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.


