అమ్మా.. బతకాలని ఉంది..! | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. బతకాలని ఉంది..!

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

గొల్లపల్లి: వారిది నిరుపేద కుటుంబం. కూలీపనులు చేసుకుంటూ.. ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న ఆ కుటుంబంలో పెద్ద ఆపద వచ్చిపడింది. కుమారుడికి కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ముందుగా జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది ప్యాంక్రియా టైటిస్‌గా గుర్తించారు. అక్కడ వైద్యం అందించినా.. నయం కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. అప్పు చేసి హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని బతికించుకునేందుకు ఆ కుటుంబం తాపత్రయపడుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది.

కన్నీరు పెట్టిస్తున్న బాలుడి కథ

గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన రజితను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఆరే తిరుపతికి ఇచ్చి 20ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కుమారుడు దీక్షిత్‌, కూతురు ఉన్నారు. తండ్రి తిరుపతి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. పిల్లల ఆలనాపాలన తల్లి రజిత చూసుకుంటోంది. దీక్షిత్‌ కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో రజిత ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అతడికి ప్యాంక్రియాటైటిస్‌ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. మందులు వాడినా.. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా అల్లాడుతున్నాడు. ఏడాది కాలంగా దీక్షిత్‌ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆ తల్లి కొడుకును కాపాడుకునేందుకు జగిత్యాలతోపాటు కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తోంది.

అప్పుల ఊబిలో కుటుంబం

కుటుంబం గడిచేందుకే ఆ కుటుంబం పడరానిపాట్లు పడుతోంది. ఇక దీక్షిత్‌ చికిత్స కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ కుటుంబానికి సొంత ఇల్లు లేదు. గుంటభూమి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పు చేసి.. సుమారు రూ.7లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెడుతోంది. తీవ్ర కడుపునొప్పితో కొడుకు విలవిల్లాడిపోతుంటే ఆ తల్లి ఏం చేయాలో తెలియక మౌనంగా రోదిస్తూ.. లోలోపల కుమిలిపోతోంది.

చదువులో ముందంజ

అనారోగ్యంతో ఉన్నా దీక్షిత్‌కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. మందులు వాడుతూనే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఉపాధ్యాయులు అతడిని అభినందించి.. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయారు.

దాతల సాయం కోసం ఎదురుచూపులు

‘నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి.. దేవుడా.. బతికించు..’ అంటూ ఆ తల్లి కలిసిన ప్రతిఒక్కరికీ చేతులెత్తి దండం పెడుతోంది. కళ్లముందే కొడుకు దీనస్థితికి చేరడం.. వైద్యం అందిస్తామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆ తల్లి వేదన వర్ణణాతీతం. ప్రస్తుతం దీక్షిత్‌కు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.7లక్షలు ఖర్చయ్యాయని, మరో రూ.7లక్షలు అయితే కొడుకు బతికే అవకాశం ఉందని ఆ తల్లి వేడుకుంటోంది. దాతలు స్పందించి తన కొడుకును బతికించాలని అర్థిస్తోంది.

మృత్యువుతో పోరాడుతున్న 17 ఏళ్ల బాలుడు

ప్యాంక్రియా టైటిస్‌గా గుర్తించిన వైద్యులు

అప్పు చేసి వైద్యం అందిస్తున్న పేద కుటుంబం

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

దాతలు స్పందించాలని వేడుకోలు

సహాయం చేయాలనుకునే దాతలు

96664 21275 నంబర్‌లో సంప్రదించాలని

వేడుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement