పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటకు చెందిన బండారి లక్ష్మి (55) నాగుపాము కాటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లిన లక్ష్మిని పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

వడదెబ్బతో వృద్ధుడి..

బుగ్గారం: మండలంలోని చిన్నాపూర్‌కు చెందిన బియ్యాల బాపురావు (65) వడదెబ్బతో మృతిచెందాడు. భార్య మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని కరీంనగర్‌లోని కుమారుల వద్ద ఉంటోంది. బాపురావు తన కూతురు గ్రామమైన మల్యాల మండలం మద్దుట్లకు రెండు రోజుల క్రితం వెళ్లాడు. మంగళవారం చిన్నాపూర్‌ వచ్చాడు. ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి అయినా ఆయన బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు.

కాలువిరిగిన ఉపాధిహామీ కూలి

చందుర్తి(వేములవాడ): ఉపాఽధిహామీ పనులు చేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి కూలీ కాలు విరిగింది. ఈ సంఘటన చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు. చందుర్తి మండలం నర్సింగపూర్‌లో ఉపాధిహామీ పథకంలో కందకాల పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్న సమయంలో కూలీ దేశవేని లక్ష్మి(45) కాలు జారి గుంతలో పడడంతో కాలు విరిగింది. దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మొక్కజొన్న పంట దగ్ధం

మల్లాపూర్‌ : షార్ట్‌ సర్క్యూట్‌తో ఎకరంన్నర మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని వేంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్ముల లత ఎకరంన్నర మొక్కజొన్న సాగుచేసింది. కూలీలతో కంకులను రాశిగా పోసింది. ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగి మొక్కజొన్న పంటకు అంటుకున్నాయి. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మొత్తంగా రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పేర్కొంది. ఆర్‌ఐ అశోక్‌, సర్పంచ్‌ గుగ్లావత్‌ రాజేందర్‌, ఉపసర్పంచ్‌ రొడ్డ హరీకరాజు వెళ్లి పంటను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement