గంభీరావుపేట(సిరిసిల్ల): వ్యవసాయ రంగంలో సరికొ త్త విప్లవానికి నాంది పలుకుతూ గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ప్రా జెక్టును ప్రజాప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాధారణంగా రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం ద్వారా వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుందన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి రక్షణతోపాటు రైతులకు వ్యవసాయ వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయాన్ని మరింత లాభాసాటిగా మార్చేందుకు రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులు పాటించాలని సూచించారు.
11 విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన
సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 ప్రాంతాల్లో రూ.30కోట్ల అంచనాతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు గంభీరావుపేటలోని సబ్‌స్టేషన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
గంభీరావుపేటలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన


