కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని, అర్జీలను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయాశాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతీ అర్జీని సునిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని, సదరు సమాచారం అర్జీదారుకు తెలుపాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు అధికమొత్తంలో రాగా మొత్తం 99 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. మండలస్థాయి, డివిజన్‌స్థాయి, మునిసిపల్ స్థాయిలో ప్రజావాణి జరుగుతుండటంతో అర్జీలు తగ్గాయి.
డివిజనల్ ప్రజావాణి షురూ
డివిజన్‌స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం కలెక్టరేట్‌లో డివిజన్‌స్థాయి ప్రజావాణిని నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోనే ఓ వైపున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్ అర్జీలను స్వీకరించగా ఆయాశాఖల డివిజన్‌స్థాయి అధికారులకు బదలాయించారు.
గ్రామంలోని 207, 301 సర్వే నంబర్లలో 6.08ఎకరాల భూమి ఉంది. కొంత భూమి సంపత్ పేరుపై కనిపిస్తోంది. ఇదెక్కడి అన్యాయమని అధికారులను కలిస్తే ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ఏ రకంగా అతని పేరున మారిందో వివరాలివ్వాలని ఏడాదికాలంగా తిరుగుతుంటే జవాబు లేదు. ఒకరి భూమిని మరొకరి పేరున ఇష్టారీతిగా మార్చేందుకే అధికారమిచ్చిందా ప్రభుత్వం?
– కె.చిన్నరాజయ్య, ముత్తారం, శంకరపట్నం
జిల్లాకు మంజూరైన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని అందుబాటులోకి తీసుకురావాలి. డిస్పెన్సరీ మంజూరై నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు. జిల్లాలో అనేకమంది ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులు ఉన్నారు. డిస్పెన్సరీ పనిచేయకపోవడంతో చిన్న చికిత్సలకై నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
– శ్రవణ్, భారతీయ మజ్దూర్ సంఘ్
ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వింటాల్‌కు 8కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. అక్కడి నుంచి మిల్లుకు వెళ్లాకా మిల్లర్లు 2కిలోలు తరుగు తీస్తున్నారు. నిబంధనలను అమలు చేయకుండా అక్రమాలకు పాల్పడుతుండగా సెంటర్ నిర్వాహకులు, సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
– రైతులు, బొమ్మకల్, సైదాపూర్
గ్రామంలో పెద్దచెరువు ప్రధాన జల వనరు. రానున్న రోజుల్లో లోటు వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ క్రమంలో పెద్దచెరువు మరమ్మతు పేరుతో నీటిని విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం చేపల కాంట్రాక్టర్ కోసం గ్రామ పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. నీటిని వదలకుండా కలెక్టర్ తక్షణమే చొరవ చూపాలి. – రైతులు, ఎలగందుల, కొత్తపల్లి
మొత్తం అర్జీలు: 99
డీఆర్డీవో: 33, డీపీవో:09
సీపీ ఆఫీస్: 07
ఆర్డీవో హుజూరాబాద్: 08


