డీఎఫ్‌వో బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఎఫ్‌వో బాధ్యతల స్వీకరణ

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఫారెస్ట్‌ అధికారి(డీఎఫ్‌వో)గా ఎస్‌.సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఇక్కడ డీఎఫ్‌వోగా వ్యవహరించిన బాలమణి కొమురంభీం అసిఫాబాద్‌ జిల్లాకు బదిలీ అయిన విషయం తెలి సిందే. సత్యనారాయణ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌వోను అటవీ అధికా రుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్వోలు, డిప్యూటీ ఆర్వోలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి

కొత్తపల్లి: ప్రతిరైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ ఉప సంచాలకుడు డీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ ఉషారాణి సూచించారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కొత్తపల్లి రైతు వేదికలో చింతకుంట, రేకుర్తి, సీతారాంపూర్‌ రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తూ సేంద్రీయ ఎరువులు వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్‌ ఫామ్‌ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, పంట రుణాలు, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, సమతుల ఎరువులపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్టె ఎరువులు వాడాలని ఏవో అనూష తెలిపారు. ఏఈఓ రాము, ఆదర్శ రైతులు చిట్కూరు శ్రీనివాస్‌, చింతల శ్రీనివాస్‌ రెడ్డి, కోదాడ శంకర్‌ పాల్గొన్నారు.

సమ్మక్క చెరువు ప్రాంతంలో ‘ఇనార్ట్‌’ వ్యర్థాలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేసిన అనంతరం వెలువడే ‘ఇనార్ట్‌’ వ్యర్థాలను నగరంలోని 7వ డివిజన్‌ సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలోని లోతట్టు ప్రాంతంలో వేయడం వివాదంగా మారింది. డంప్‌యార్డ్‌లో చెత్తను యంత్రాల ద్వారా జల్లెడ పట్టినప్పుడు వెలువడే రీసైకిల్‌కు వీలులేని వ్యర్థాలను ఇనార్ట్‌ అంటారు. ఈ వ్యర్థాలను సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో ఎస్‌టీపీ పక్కన లోతట్టు ప్రాంతంలో నగరపాలకసంస్థ సిబ్బంది పడేస్తున్నారు. దీంతో సోమవారం స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని ఇనార్ట్‌ వ్యర్థాలను తీసుకొచ్చిన లారీని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ వ్యర్థాలు వేయడం మూలంగా తమ ప్రాంతం కలుషితం అవుతుందని, ఇప్పటికే దుర్వాసన వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్‌ ఆకుల ప్రకాశ్‌ పాల్గొన్నారు.

రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరపాలకసంస్థ 40వ డివిజన్‌ తిరుమల్‌నగర్‌లో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్‌ నలువాల పుష్పలత రవీందర్‌తో కలిసి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కాలనీలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలను స్థానిక ప్రజలు మేయర్‌ దృష్టికి తేవడంతో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement