వైకుంఠపాళి(కై లాసం) ఆట ఇంట్లో కూర్చుని పిల్లలు, పెద్దలు ఆడుకుంటారు. చిన్నారులు నాయనమ్మలు, అమ్మమ్మలతో కూర్చుని ఆడుకోవడం ద్వారా కుటుంబ విలువలు, మానవీయ విలువలు పిల్ల లకు అర్థం అవుతాయి. ఇది ఈ ఆట పరమార్థం.
ఆట ఇలా...
వైకుంఠపాళి ఆటను ఎంతమందైనా ఆడవచ్చు.. ఒక్కొక్కరు వేరువేరు రకాల పావులు అమర్చుకోవాలి. ఆట ఆడేవారంతా పటానికి ఎదురుగా కూర్చోవాలి. నాలుగు గవ్వలతో వందెం వేయాలి. పటంలో 1నుంచి 132 గళ్లు ఉంటాయి. గళ్లల్లో రకరకాల బొమ్మలు ఉండి గళ్లకు కింది భాగాన పాములు, ఏనుగులు ఉంటాయి. ఆటను 1 నుంచి(పాతాళం) మొదలుపెట్టి పావులను కదుపుతూ ఆట ఆడుతారు. కన్ను, రెండూ, మూడు, నాలుగు, ఎనిమిది వంటి పదాలు చెలామణిలో ఉన్నాయి. పటంలో 16, 19, 30, 41, 52, 63, 65, 74, 79, 87 సంఖ్యల గళ్లల్లో నిచ్చెనలు ఉంటాయి. పందెం వేసిన సంఖ్యను బట్టి నిచ్చెన ఎక్కవచ్చు. పుణ్యం చేసిన వారు నిచ్చెన సహాయంతో సులభంగా స్వర్గం చేరుతారనేది ఈ ఆటలో నమ్మకం. పటంలో అక్కడక్కడా పాములు ఉంటాయి. పావు పాము నోటిలో పడితే ఆటగాడు కిందకు జారి పోతాడు. ఇలా పావులతో నిచ్చెనలు ఎక్కుతూ పాములు మింగేస్తూ ఆట ముందుకు సాగుతుంది.
– సాక్షి, కరీంనగర్ డెస్క్


