ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

కరీంనగర్‌ టౌన్‌/సప్తగిరికాలనీ(కరీంనగర్‌)/కరీంనగర్‌ అర్బన్‌: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష ఆదివారం కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని ఏడు కేంద్రాల్లో మొత్తం 2,928 మంది అభ్యర్థులకు 2,865 మంది పరీక్ష రాశారు. మహిళా డిగ్రీ కళాశాలలో 725 మంది, ఎస్సారార్‌ కళాశాలలో 704 మంది, కేంద్రీయ విద్యాలయంలో 376 మంది, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 305మంది, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 283 మంది, టీజీఎస్‌డబ్ల్యూ చింతకుంటలో 239 మంది, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 233 మంది పరీక్ష రాశారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. మెటల్‌ డిటెక్టర్లు, బయోమెట్రిక్‌ విధానం ద్వారా పారదర్శకతను పాటించారు. పరీక్షా ప్రశ్నాపత్రం ఈ ఏడాది మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు మంచి ర్యాంకులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్‌ చిత్రామిఽశ్రా తెలిపారు. కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోఆర్డినేటర్లతో వసతులు, అభ్యర్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో అత్యధిక సంఖ్యలో హాజరై పరీక్ష రాశారని, హాజరుశాతం సంతృప్తికరంగా నమోదయిందన్నారు. ఏడు కేంద్రాల్లో 100శాతం బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement