స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
మండలాల వారీగా వేలాది మందిని యాత్రకు తీసుకురండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు
కరీంనగర్: కరీంనగర్‌లో ఈనెల 12న నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ను దిగ్విజయవంతం చేసి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలన్నారు. ఏక్తా యాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. పార్టీ నాయకులంతా వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. మే 12న సాయంత్రం 4 గంటలకు, వైశ్యా భవన్ నుంచి హిందూ ఏక్తాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు.
మోడీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి
ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరించాలని ఆయన సూచించారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
జ్యోతినగర్‌లోని కేడీఆర్ పార్కు వద్ద బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి రూ.16 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.


