కరీంనగర్ అర్బన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణితో పాటు ఇక రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రజావాణి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని 21వ డివిజన్‌లో నగరపాలకసంస్థ సాధారణ నిధులు రూ.17.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. నగర ప్రజలకు సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గ ధ్యేయం అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లను అభివృద్ధి పరుస్తామన్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ లో అన్ని డివిజన్లకు నిధులను కేటాయించి, ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి పాల్గొన్నారు.


