అనుమతి తప్పనిసరి! | - | Sakshi
Sakshi News home page

అనుమతి తప్పనిసరి!

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

గ్రానైట్‌ పరిశ్రమలకు అధికారుల అల్టిమేటం

పంక్షన్‌ హాళ్లు, ఫాంహౌజ్‌లపై చర్యలకు నిర్ణయం

‘సాక్షి’ కథనాలతో కదులుతున్న పంచాయతీ పాలకవర్గాలు

కొత్తపల్లి(కరీంనగర్‌): గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలు తప్పనిసరిగా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమల అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలపై పంచాయతీ పాలకవర్గాల్లో కదలిక మొదలైంది. నిధులలేమితో నిర్వీర్యంగా మారిన గ్రామ పంచాయతీలను ఓ గాడిలో పెట్టేందుకు ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గ్రానైట్‌ పరిశ్రమల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఎలగందుల, ఖాజీపూర్‌, నాగులమల్యాల, బద్ధిపల్లి, కమాన్‌పూర్‌ గ్రామాల్లో గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలతో పాటు గ్రానైట్‌ క్వారీలు, పెట్రోల్‌ బంక్‌లు, ఫాంహౌజ్‌లు, ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో నిత్యం రూ.కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయినప్పటికీ పంచాయతీల్లో ఆదాయం కనిపించడం లేదు.

బావుపేట పాలకవర్గ అడుగుజాడల్లో

గ్రామ పంచాయతీలకు నిధులు సేకరించడమే లక్ష్యంగా బావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరహాలోనే మిగిలిన గ్రామ పంచాయతీలు కదిలేందుకు సిద్ధమవుతున్నాయి. అనుమతిలేని గ్రానైట్‌ పరిశ్రమలు, ఫంక్షన్‌హాల్‌లు, పెట్రోల్‌ బంక్‌లు, ఫాంహౌజ్‌లు, క్రషర్లను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించకపోతే సీజ్‌ చేస్తున్నారు. బావుపేటలో ఒక గ్రానైట్‌ పరిశ్రమను సీజ్‌ చేయడంతో మిగిలిన ఐదు పరిశ్రమలు అనుమతులు పొంది ఇంటి నంబర్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. పంచాయతీ పాలకవర్గంపై రాజకీయ ఒత్తిడి ప్రయోగించిన్పటికీ ఆదాయమే ప్రధాన ఎజెండా కఠిన నిర్ణయం తీసుకోవడంతోనే గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు దారికొస్తున్నారు. అనుమతులకు సంబంధించిన మొత్తం చెల్లించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వేదికగా నిర్ణయం జరగడంతో నోటీసులిచ్చిన ‘గ్రానైట్‌ పంచాయతీ’ కొంతమేర సమసింది. ఇదే తరహాలో ఖాజీపూర్‌, బద్ధిపల్లి తదితర గ్రామ పంచాయతీలు ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి.

అనుమతిలేని నిర్మాణాలపై దృష్టి

కొత్తపల్లి మండలంలో అనుమతిలేని నిర్మాణాలపై పంచాయతీ పాలకవర్గాలు దృష్టి సారించాయి. అనుమతిలేని ఫంక్షన్‌ హాళ్లు, ఫాంహౌజ్‌లు, పెట్రో ల్‌ బంక్‌లను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతుల అంశాన్ని అమాత్యులకు తెలపకుండా క్షేత్రస్థాయిలో కొంతమంది వారి పేర్లు చెబుతూ పంచాయతీ అధికారులను బెదిరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు విషయం తెలియని అమాత్యులు అనవసరంగా బదనాం అవుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement