జలగల దందా.. అడ్డుందా! | - | Sakshi
Sakshi News home page

జలగల దందా.. అడ్డుందా!

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

ధనార్జనే ధ్యేయం.. నాణ్యత ప్రమాణాలు దూరం

జిల్లాలో వందల్లో అనుమతి లేని వాటర్‌ ప్లాంట్లు

ఐఎస్‌ఐ స్టాండర్డ్‌ ఉన్నవి నాలుగే

నిత్యం లక్షల లీటర్ల నీటి వ్యాపారం

ఆటోలో ఉన్న క్యాన్లను పరిశీలించారా.. ఏ క్యానూ శుభ్రంగా లేదు. నగరంలోని భగత్‌నగర్‌లో గల శుద్ధజల కేంద్ర వాహనమిది. రోజు వేల లీటర్ల విక్రయాలు జరుగుతుండగా శుభ్రత శూన్యం.

వినియోగదారులకు నీటిపై అవగాహన లేకపోవడంతో శుద్ధ జలమని తాగేస్తున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: వేసవి అవసరాలను ఆధారంగా చేసుకుని విచ్చలవిడిగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్‌, జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 750 వరకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించాయి. వీటిలో బీఎస్‌ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే కాగా, మిగతావన్ని నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు దర్జా ఒలకబోస్తూ ప్రజల ప్రాణాలతో అటలాడుతున్నాయి.

విచ్చలవిడి ప్లాంట్లు.. లక్షల వ్యాపారం

జిల్లాలో 750కి పైగా శుద్ధజల కేంద్రాలు ఉండగా నాలుగింటికి అనుమతి ఉంది. అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్‌ ప్లాంట్లలో కరీంనగర్‌ నగరపరిధిలో 200 వరకున్నాయి. కూల్‌వాటర్‌, మినరల్‌ వాటర్‌ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. నీటిని శుద్ధి యంత్రాలకు ప్రభుత్వపరంగా గుర్తింపు లేకపోవడం గమనార్హం. గంటకు 2వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం ము న్సిపల్‌శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు కనీసం 5గుంటల స్థలం కావాల్సి ఉండగా, 200 అడుగుల గదుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మినరల్‌ వాటర్‌ క్యాన్లు నింపడానికి ప్రత్యేక సదుపాయాలతో గదులు కావాల్సి ఉండగా ఆరుబయట పైపుల ద్వారా నింపుతున్నారు. క్యాన్‌లను శుద్ధిచేసే ప్రక్రియ వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్‌ బ్రష్‌లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. కొందరు మున్సిపల్‌ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

కేంద్రాల్లో ఇవెక్కడ?

వాటర్‌ ప్లాంట్‌ నెలకొల్పాలంటే మున్సిపాలిటీల్లో కమిషనర్‌, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. నీటిలో పూర్తిగా కరిగిన లవణాలను పరీక్షించాలి. పీహెచ్‌ 7.5శాతం కన్నా తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి ఽశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. వాటర్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి నిర్వహణ, నాణ్యత ప్రమాణాలను ఫుడ్‌ కంట్రోల్‌ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అనధికారికంగా నడిచే వాటర్‌ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు.

అధికారులేం చేస్తున్నట్లు..

పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లు వెలుస్తుండగా సంబంధితశాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఏనాడు సదరు కేంద్రాలపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి అక్రమంగా కేంద్రాన్ని కొనసాగించాలంటే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది ఏళ్లకు ఏళ్లుగా దర్జాగా దందా చేస్తున్నారంటే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి లభ్యత ఆధారంగా భూగర్బజల శాఖ నీటి ఏర్పాటుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏ విధమైన పైపులు వాడుతున్నారు, నీటి శుద్ధికి ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో ఉపయోగిస్తారనే దానిని ఆహార తనిఖీ అధికారులు పరీక్షించాలి. శుద్ధి చేసిన నీటిని తాగేందుకు అనువుగా ఉందా లేదా అనేది వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ధారించాలి.

Advertisement
 
Advertisement
Advertisement