ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

● బాల కార్మికులు లేని జిల్లాగా మార్చాలి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ టౌన్‌: సమాజ అభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్‌ చిత్రామిశ్రా భరోసానిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులను వెల్ఫేర్‌ బోర్డు కింద నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక సాయం గురించి తెలిసేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి వ్యాపారులు, గ్రిగ్‌, మున్సిపల్‌ తదితర విభాగాల్లో పనిచేస్తూ, అసంఘటిత కార్మికులుగా నమోదు కాకుండా ఉంటే వెంటనే నమోదు చేయించాలని ఆదేశించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతున్నాయన్నారు. శానిటేషన్‌ కార్మికుల భద్రత, బీమా, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ బ్రోచర్‌ ఆవిష్కరించారు. బెస్ట్‌ ఎంప్లాయీమెంట్‌, బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, స్పెషల్‌ కేటగిరీ పురస్కారాలు అందించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కోలా ప్రసాద్‌, జిల్లా ఎంప్లాయీమెంట్‌ ఆఫీసర్‌ తిరుపతిరావు, ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్‌ అశోక్‌ పాల్గొన్నారు.

పక్కాగా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నిర్వహించే నియోజకవర్గస్థాయి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్‌లో శనివారం జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాలు, ధాన్యం కొనుగోలు..నీట్‌ పరీక్ష ఏర్పాట్లు.. రైతువారం విజయవంతంపై సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. ఆదివారం జరగనున్న నీట్‌ పరీక్షకు పక్కా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 4నుంచి ప్రారంభమయ్యే రైతువారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఈ నెల 5న మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో టాస్క్‌, ఎంప్లాయీమెంట్‌, ఇండస్ట్రియల్‌, స్పోర్ట్స్‌శాఖల అధికారుల సమక్షంలో జాబ్‌మేళా పోస్టర్‌ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement