● స్వగ్రామం చేరిన మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉన్న ఊర్లో ఉఫాధి లేక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ వెళ్లిన రైతు అక్కడే గండెపోటుతో మరణించగా.. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. శవపేటిక రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకట్‌రెడ్డి(48) అనే గల్ఫ్ కార్మికుడు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మలేషియాలో మృతిచెందాడు. స్వగ్రామంలో ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం ఆరేళ్ల క్రితం కంపెనీ వీసాపై గల్ఫ్‌కు వెళ్లాడు. 22 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి తిరిగి మలేషియాకి వెళ్లిన వెంకట్‌రెడ్డి గదిలోనే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని అక్కడి మిత్రులు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించాలని సిరిసిల్ల శాసన సభ్యుడు కేటీఆర్‌ను కోరగా.. స్పందించిన కేటీఆర్ అక్కడి అధికారులతో మాట్లాడి 4 రోజుల్లో మృతదేహం ఇంటికొచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. మృతుడికి భార్య వనజ, కుమార్తె జావలి ఉన్నారు.


