ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పంది ర్ల శ్రీనివాస్‌గౌడ్(56) అనే గీతా కార్మికుడు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్‌లో శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. తన భార్య గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లింది. అనంతరం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొంతకాలంగా శ్రీని వాస్‌గౌడ్ అప్పులతో బాధ పడుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లిఫ్ట్ ఇస్తానని చైన్ చోరీ
ముస్తాబాద్(సిరిసిల్ల): అమ్మలాంటిదానివని నమ్మించి.. బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని వృద్ధురాలిని ఎక్కించుకున్న అపరిచిత వ్యక్తి పుస్తెలతాడు దొంగిలించాడు. నిందితుడి ఫొటోలను ముస్తాబాద్ ఎస్సై గణేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఎస్సై వివరాల ప్రకారం.. గత నెల 20న ఆవునూర్‌కు చెందిన పొన్నాల యాదమ్మ(65) అనే వృద్ధురాలు సిద్దిపేటలో ఉన్న కుమార్తె ఇంటికెళ్లింది. తిరుగు ప్రయాణంలో సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద యాదమ్మ బస్సు కోసం వేచి ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటూ యాదమ్మను పలకరించాడు. ముస్తాబాద్‌కు వెళ్లాలని యాదమ్మ చెప్పగా.. తాను అటే వెళ్తున్నానని, అమ్మలాంటిదనివని బైక్‌పై ఎక్కించుకున్నాడు. ముస్తాబాద్ శివారులోకి రాగానే యాదమ్మ మెడలోని బంగారు పుస్తెలతా డును లాక్కొని పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై వివరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యాదమ్మను మోసం చేసిన వ్యక్తి ఫొటోలు, వీడియోలు వెలుగు చూశాయన్నారు. సదరు గు ర్తుతెలియని వ్యక్తి తెల్లని షర్టులో ఉన్నాడని, మర్యాదస్తుడిలా కనిపిస్తూ మోసాలకు పాల్ప డుతున్నట్లు గుర్తించామని అన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులోని మానేరు తీరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. జిల్లాలోని ముత్తారం మండల కేంద్రానికి చెందిన తడవేన పోచాలు(35) పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులో శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. అక్కడ ఏమైందో ఏమోగానీ స్థానికులకు మృతి చెంది కనిపించాడు. వడదెబ్బతో మృతి చెందాడా? లేదా వేరే ఇతర కారణంతో మృతి చెందాడా? అనేది తెలియడం లేదు. ఈవిషయం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది.


