న్యూస్‌రీల్
కార్పొరేటర్లు అయితేనే కేసులు
కాంట్రాక్టర్ల దౌర్జన్యంపై కిమ్మనని అధికారులు
కార్పొరేటర్లపై కేసులు పెట్టి జైలుకు
వివాదాస్పదంగా బల్దియా ఉద్యోగుల తీరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
తిడితే కాంట్రాక్టర్లే తిట్టాలి.. దౌర్జన్యం చేస్తే వాళ్లే చేయాలి.. కుర్చీలు, బల్లలు కాంట్రాక్టర్లు విసిరేస్తే ఓకే.. అలా కాదని కార్పొరేటర్లు తిడితే ఆగమేఘాలపై పోలీసు కేసులు పెట్టుడే.. అవసరమైతే జైలుకు పంపుడే.. వివాదాస్పదంగా మారుతున్న నగరపాలకసంస్థ ఉద్యోగులు, అధికారుల తీరిదీ. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే కాంట్రాక్టర్ల దౌర్జన్యాలపై కిమ్మనని అధికారులు, ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు గట్టిగా గొంతెత్తితే చాలు పోలీసు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, పైపెచ్చు ఉద్యోగ సంఘాలతో ఆందోళన చేయించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
కాంట్రాక్టర్ల దౌర్జన్యాలపై కిమ్మనరెందుకో?
పనులు, టెండర్లు, బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు నిత్యం కార్యాలయంలో అధికారులతో ‘టచ్’లో ఉండడం తెలిసిందే. సహజంగానే కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారుల నడుమ వీటి విషయంలో తేడాలొస్తుంటాయి. నగరపాలకసంస్థలో వివాదాస్పద కాంట్రాక్టర్‌గా ముద్రపడ్డ వ్యక్తి ఒకరు ఇవే విషయాల్లో అధికారులపై పలుమార్లు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. పలువురు కాంట్రాక్టర్లు ఇంజినీరింగ్ అధికారులను వారి చాంబర్లలో, కారిడార్‌లలో, కార్యాలయ ఆవరణలో బూతులు తిట్టడం, కుర్చీలు పడవేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం కాంట్రాక్టర్లు, ఓ డీఈల నడుమ బూతు పురాణం చోటుచేసుకొంది. ఏళ్లకాలంగా కాంట్రాక్టర్లు కార్యాలయంలోనే అధికారులపై దౌర్జన్యం చేస్తున్నా, ఇప్పటివరకు ఒక్క పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
కార్పొరేటర్లయితే కేసులే
ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలకసంస్థ అధికారులతో కార్పొరేటర్లు చర్చిస్తుంటారు. ప్రజాప్రతినిధులుగా సమస్యలను పదేపదే అధికారుల దృష్టికి తీసుకువచ్చినా, పరిష్కారం కాని సందర్భంలో కార్పొరేటర్లు ఆగ్రహం చెందుతుంటారు. గత పాలకవర్గ సమయంలో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన ఓ ఫైల్ పెండింగ్ విషయంలో అప్పటి కార్పొరేటర్ మెండి శ్రీలత భర్త, మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ టీపీఎస్ తేజస్విని, కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై రాత్రికి రాత్రే వన్‌టౌన్‌పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కొన్ని గంటల్లోనే జైలుకు పంపించారు. చివరకు ఎస్సీ కమిషన్ ఎదుట అధికారులే చంద్రశేఖర్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాజాగా రూపాయి అంత్యక్రియల పథకం వర్తించడానికి స్థానిక ఆధార్, రేషన్‌కార్డులు లేవనే సాకుతో అడ్డుచెప్పడంపై మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సుమన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయన కార్యాలయానికి వచ్చి కుర్చీ,టేబుల్ పడవేశాడని, శానిటేషన్ సూపర్‌వైజర్‌ను తిట్టాడంటూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో రాత్రికి రాత్రే కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించే క్రమంలో నేతల ఒత్తిడితో రిమాండ్‌కు బదులు స్టేషన్ బెయిల్‌తో బయటకు వచ్చారు.
కార్పొరేటర్ల సంఘీభావం
పోలీసు స్టేషన్‌లో ఉన్న మాజీడిప్యూటీ మేయర్‌గుగ్గిళ్లపు రమేశ్‌కు పార్టీలకతీతంగా కార్పొరేటర్లు సంఘీభావం పలికారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వైద్యుల అంజన్‌కుమార్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, బీజేపీ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి రమేశ్‌కు ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లలో కూడా ఐక్యత తెచ్చేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు.
వాళ్లపై కేసులు...వీళ్లతో రాజీలు
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. తమను తిట్టారని, దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసులు పెట్టడం, ఉద్యోగ సంఘాలు వచ్చి ఆందోళనలు చేయడం సహజమే. విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు తమను తిడితే పడాలని ఎక్కడా లేదు. కాంట్రాక్టర్లు తిడితే కిమ్మనకపోవడం, కార్పొరేటర్లు తిట్టారని కేసులు పెట్టి జైళ్లకు పంపడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు తిడితే ఆత్మగౌరవం దెబ్బతింటుంది...మరొకరు తిడితే ఆత్మగౌరవానికి వీసమెత్తు కూడా నష్టం వాటిల్లని ‘తేడా’ ఎందుకనేది ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇందులో ఉన్న ‘మతలబేమిటో’ బల్దియా ఉద్యోగులే వెల్లడించాల్సి ఉంది.


