చిగురుమామిడి/కరీంనగర్ సిటీ: చిగురుమామిడి మండలంలోని 17గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చిగురుమామిడి మండలపరిషత్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో 21 కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సుందరగిరిలో వేసిన బోర్ మోటారుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై విద్యుత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్– కొత్తపల్లి రోడ్డు పనుల్లో పైపులైన్ ఎందుకు షిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీపీవో జగదీశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, జెడ్పీసీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
యూరియా వాడకాన్ని తగ్గించాలి
రైతులు తక్కువగా యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలని మంత్రి ప్రభాకర్ కోరారు. చిగురుమామిడి రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల మేరకు నూతన ఒరవడిలో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. మహాలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల్లో సహకరించాలని కోరారు.
ఎస్‌యూ ఇంజినీరింగ్ కళాశాలకు అన్ని వసతులు
హుస్నాబాద్‌లో అన్ని వసతులతో కూడిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మాపూర్‌లో నిర్మించనున్న కళాశాల భవన నిర్మాణాల స్థలాన్ని పరిశీలించారు. స్థల పత్రాలను ఎస్‌యూ వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్‌కు అందించారు. హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని పేర్కొన్నారు.


