మీనం విలవిల | - | Sakshi
Sakshi News home page

మీనం విలవిల

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

ఎండకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

ఎండ సలసల..

బోయినపల్లి(చొప్పదండి): మునుషులకే కాదు.. చేపలకూ ఎండదెబ్బ తగులుతోంది. భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా చెరువులు, కుంటల్లో నీరు తగ్గి ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. నీటి నాణ్యత తగ్గడం, గాఢత పెరగడం తదితర కారణాలతో చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తం చేపలు చనిపోతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులు వల్ల వాటికి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువవుతాయి.

నాలుగు ప్రాజెక్టులు, 340 చెరువులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 340 వరకు చెరువులు, కుంటలు ఉన్నాయి. బోయినపల్లి మండలం మాన్వాడలో మిడ్‌మానేరు, గంభీరావుపేట మండలంలో ఎగువమానేరు, ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ, కోనరావుపేట మండలంలో మల్కపేట ప్రాజెక్టులు ఉన్నాయి. గతేడాది సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో 1.35 కోట్ల మేర చేపపిల్లలు వదిలినట్లు సంబంధిత అధికారి తెలిపారు.

● రోజూ చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలిక గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం, మొప్పెల రంగు, పై జిగురు తదితర లక్షణాలను పరిశీలించాలి. తేడాలు గమనిస్తే, సంబంధిత శాఖ అధికారి సలహాలు తీసుకోవాలి.

● ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో చేపలు చెరువు పైభాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాల్లో చెరువులో నీరు పెట్టడం లేదా పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించాలి. దీంతో చేపల సాంద్రత తగ్గి ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చేపలు మార్కెట్‌ సైజు రాలేదని, రేటు లేదని, ఐస్‌ దొరకలేదనే కారణాలతో మత్యకారులు నిర్లక్ష్యం చేయొద్దు.

● చెరువులో ప్రాణవాయువు లోటు ఉన్నట్లు అనిపిస్తే ఎకరాకు 1 కేజీ కాల్షియం పెరాకై ్సడ్‌ను ఇసుకతో కలిపి చెరువు నీటిలో చల్లాలి. దీంతో ప్రాణవాయువు పెరుగుతుంది. చెరువులోని నీటి నాణ్యత తగ్గినపుడు ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు సున్నం చెరువులో చల్లితే నీటి నాణ్యత, ప్రాణవాయువు శాతం పెరిగి ఉదజని సూచికను అదుపులో ఉంచుతుంది.

● చెరువులోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గించాలి. లేకుంటే రాత్రి సమయాల్లో అవి కేవలం కార్బన్‌ డై ఆకై ్సడ్‌ విడుదల చేయడం వల్ల చేపలకు ప్రాణవాయువు కొరత ఏర్పడి చనిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో మత్యకారులకు ఎవరైన గిట్టనివారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపితే కార్పు జాతి చేపలే కాకుండా కొర్రమట్ట (మర్రల్‌), మార్పు, జెల్లలు, తక్కువ ఆక్సిజన్‌ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు కూడా చనిపోతాయి. అలాంటి అనుమానాలు నిజమా కాదా అని నిర్ధారించుకోవాలి.

● వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే వాటిని తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గొయ్యి తీసి పూడ్చివేయాలి. అనంతరం ఒక హెక్టారుకు 100 నుంచి 250 కిలోల సున్నం మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలను (బెంజాల్‌ కొలియం క్లోరైడ్‌) ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వల్ల నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్నజీవులు చనిపోతాయి. ఇన్ని చేసినా ఎలాంటి మార్పు లేకుంటే చివరి అస్త్రంగా యాంటిబయాటిక్‌ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటూ కలిపి ఇవ్వాలి.

● ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా తిరిగి చెరువులోనికి పంపింగ్‌ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్భాల్లో కొన్ని చేపలను పట్టివేయడం అత్యంత శ్రేయస్కరం.

8 వేల మంది మత్స్యకారులు

జిల్లాలో చేపల పెంపకం ద్వారా సుమారు 8,642 మంది మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే 135 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, మహిళ మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలతో పాటు, ఎగువ మానేరులో మత్స్యకార్మిక సొసైటీ ద్వారా కార్మికులు చేపలతో జీవనోపాధి పొందుతున్నారు. అలాగే పలు చెరువుల్లో చేపలు పట్టడంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోంది.

చేపలకు ఎండదెబ్బ

భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో వేడెక్కుతున్న నీరు

ముందు జాగ్రత్తలే రక్ష

ఉదయం, సాయంత్రం చేపల వేట శ్రేయస్కరం

ప్రాజెక్టులు : మిడ్‌మానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ, మల్కపేట

చెరువులు, కుంటలు : 340

చేపపిల్లలు వదిలిన ప్రాజెక్టులు :

మిడ్‌మానేరు, అన్నపూర్ణ

వేసిన చేప పిల్లలు : 1.35 కోట్లు

మత్స్య కార్మికులు : 8,642

మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు : 135

Advertisement
 
Advertisement
Advertisement