చెట్టుకు కారు ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టుకు కారు ఢీకొని యువకుడి మృతి

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

రాయికల్‌: రాయికల్‌ మండలం కుమ్మరిపల్లి శివారులో కారు చెట్టును ఢీకొనడంతో చాపల్లి రాంబాబు (31) అనే వలస కూలీ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఏఎస్సై సైఫోద్దీన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రాయికల్‌ మండలం కుమ్మరిపల్లిలో పదేళ్లుగా మేసీ్త్ర పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఉదయం కూలీల కోసం కారులో జగిత్యాలకు వెళ్తుండగా.. కుమ్మరిపల్లి శివారుకు చేరగానే.. అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డాడీ.. ఒక్కసారి మమ్మల్ని చూడు అంటూ ఐదేళ్ల చిన్నారులు రాంబాబు మృతదేహంపై ఏడ్వడం అందరినీ కలిచివేసింది. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆలూరులో ఏడిళ్లలో చోరీ

రాయికల్‌: రాయికల్‌ మండలం ఆలూరులో ఒకేసారి ఏడు ఇళ్లలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గొల్ల పల్లి దుబ్బయ్య ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, పదహారు తులాల వెండి, పిట్టల సుజాత ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, రూ.40 వేలు, రాజారపు మనోహర్‌ ఇంట్లో నుంచి తులం బంగారం, సురతాని రాజు ఇంట్లో నుంచి 10 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. గొల్లపల్లి భూమరాజం, రాజారపు రాజేందర్‌, చిల్ముల మల్లక్క ఇళ్లలో దొంగతనానికి యత్నించారు. జగిత్యాల రూరల్‌ సీఐ సుదాకర్‌, ఎస్సై సుధీర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌, డ్యాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెల్గటూర్‌: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం సూరారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) పంటపొలం కోయిస్తుండగా.. వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించేందుకని 108కు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. లచ్చయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

క్యాటరింగ్‌కు వెళ్లి వస్తూ.. ఆటో బోల్తా

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

మంథనిరూరల్‌: శుభకార్యంలో క్యాటరింగ్‌ చేసి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామ సమీపంలోని గాడుదులగండి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదావరిఖని గంగానగర్‌కు చెందిన రజిత(35) మృతి చెందగా, ధనలక్ష్మి, శ్రవణ్‌కుమర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. గోదావరిఖని గంగానగర్‌కు చెందిన రజిత, ధనలక్ష్మి క్యాటరింగ్‌ చేస్తుంటారు. గురువారం ఉదయం కాటారంలో జరిగిన ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్లి క్యాటరింగ్‌ చేసి తిరిగి వస్తున్నారు. రేగులగూడెం వద్ద కమాన్‌పూర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ అనే పురోహితుడు మంథనికి వచ్చేందుకు ఈ ఆటోలో ఎక్కాడు. అయితే గాడుదులగండి మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రజిత అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి, శ్రవణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహంతోపాటు గాయడిన వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement