కొత్తపల్లి(కరీంనగర్)/సిరిసిల్ల/హుజూరాబాద్: విద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ సింగాపూర్ సబ్‌స్టేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఎస్‌ఈ ఆఫీస్‌లో గురువారం వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లైన్లను పరిశీలిస్తూ.. అంతరాయరహితంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి, ప్రజలకు ,రైతులకు విద్యుత్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించాలని సీఎండీ ఆదేశించారు. సమావేశాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగించాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు అధికశాతం నిర్లక్ష్యం, అజాగ్రత్త, అవగాహన లేక జరుగుతున్నాయని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. విద్యుత్ పరికరాలను నిర్లక్ష్యంగా వినియోగించడం, నాసిరకమైన లేదా పాడైపోయిన తీగలను వాడడం, సరైన ఎర్తింగ్ సదుపాయం లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకరమైన లైన్లు, వంగిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న తీగలను పొడవాటి స్తంభాలను అమర్చి ఎత్తు పెంచడం , ప్రజలకు సురక్షితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని చర్యలూ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని వరుణ్‌రెడ్డి వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రోజూ 24 గంటలూ అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు వెంటనే సంప్రదించాలన్నారు. కరీంనగర్ ఎస్‌ఈ ఆర్.రవీందర్, రాజన్న సిరిసిల్ల ఎస్‌ఈ టి.వేణుమాధవ్, డీఈలు లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, అనిల్ కుమార్, ఏడిఈ శ్రీనివాస్, ప్రశాంత, ఏఈ రమేష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల్లోనే 860 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామని సిరిసిల్ల సర్కిల్ ఎస్‌ఈ వి.వేణుమాధవ్ గురువారం తెలిపారు. జిల్లాలో గత ఏడాది 1,752 విద్యుత్ సర్వీసులు మాత్రమే మంజూరు అయ్యాయని, నెల రోజుల్లోనే 860 అనుమతులు ఇచ్చామన్నారు. పెండింగ్ ఉన్న 1540 సర్వీసులన్నీ జూన్‌లోగా పూర్తిచేశామని వివరించారు. జిల్లాలో అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, పనులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని వేణుమాధవ్ తెలిపారు.
నేటి నుంచి విద్యుత్ భద్రత వారోత్సవాలు
7వ తేదీ వరకు వినియోగదారులకు విద్యుత్ భద్రతపై అవగాహన
పోస్టర్ ఆవిష్కరించిన టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరణ్‌రెడ్డి


