కోల్‌సిటీ(రామగుండం): మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపినా.. ఓ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. స్ఫూర్తిగా నిలిచిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. అవయవదానం ద్వా రా మరణానంతరం కూడా జీవించి చూపించిన ఆ యువకుడు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. గురువారం గోదావరిఖనిలో అవయవదాతకు కన్నీటితో అంతియయాత్ర నిర్వహించారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌కు చెందిన పెరుక శ్రీనివాస్(43) ఓ బ్యాంకులో తాత్కాలిక కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. గత నెల 23న రాత్రి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ సీసీసీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించింది. దీంతో హైదరాబా ద్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. శ్రీనివాస్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ విషాదవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. దుఃఖంలోనూ ధైర్యంగా ముందుకొచ్చిన భార్య పి.సంధ్యారాణి.. తన భర్త అవయవదానానికి అంగీకారం తెలిపారు. వైద్యులు 28న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన అనంతరం 29న లివర్, కిడ్నీలు, కార్నియాలను సేకరించి అవసరమైన పేషెంట్లకు అమర్చారు. తద్వారా ముగ్గురికి పునఃర్జన్మతోపాటు మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించినట్లయ్యింది. భర్తను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ మానవత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన సంధ్యారాణి నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ‘అవయవదానం మహాదానం’ అనే నానుడిని ఈ ఘటన మరోసారి సార్థకం చేసింది. మృతుడు శ్రీనివాస్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడంతోపాటు అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపిన భార్యతోపాటు కుటుంబ సభ్యులను జీవన్‌ధాన్ సంస్థ, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు.
మరో ఇద్దరికి కంటి వెలుగులు ఇచ్చి..
బ్రెయిన్‌డెడ్‌తో బ్యాంక్ ప్రైవేట్ ఉద్యోగి మృతి
భర్త అవయవాలను దానం చేసిన భార్య
విషాదంలోనూ స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం


