గరం గరం.. ఎవరి తప్పిదం ఉమ్మడి జిల్లాలో హెచ్చరికగా ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్న భూభాగం వాతావరణ సమతుల్యతకు దెబ్బ
కరీంనగర్ అర్బన్: గత నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరాయి. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు వప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే జాగ్రత్తగా వ్యవహరించాలి. 41 నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరిందంటే మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతల నమోదు.. ప్రాణాలను హరించే వేడిగాలులు.. ప్రకృతి విపత్తులకు కారణమేంటి..? ఎక్కడుంది లోపం.? ఇసుక అక్రమ రవాణా, కాలం చెల్లిన వాహనాలు, వీడని ప్లాస్టిక్ భూతం, కాసారాలుగా మారిన పరిశ్రమలతో పర్యావరణం మరణపు అంచున ఘోషిస్తోంది. అందుకే మనం మారాలి.. ఇతరులను మార్చాలి.
తగ్గని ప్లాస్టిక్ వినియోగం
ప్లాస్టిక్ వినియోగం నిత్య జీవితంలో తప్పనిసరైంది. 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లను ప్రభుత్వం నిషేధించినా నియంత్రణలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ సంచులను మురుగుకాలువల్లో పారేయడంతో నీటి ప్రవాహాలకు అడ్డు తగులుతున్నాయి. భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. జిల్లాలో రోజుకు సగటున 500 వాహనాలు కొత్తగా చేరుతున్నాయి. రవాణాశాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో గత డిసెంబర్ నాటికి 1.51 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వీటి ద్వారా పొగ, ధ్వని కాలుష్యం చేరి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
వనంపై గొడ్డలి వేటు
భూ విస్తీర్ణంలో 33శాతం అడవులు ఉండాలి. పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు గురవడం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లా గణాంకాల ప్రకారం గతంలో ఉన్న పశ్చిమ డివిజన్‌లో 80వేల హెక్టార్లు, తూర్పు డివిజన్‌లో 1.50లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండేవి. కాలక్రమేణ అక్రమార్కులు పెరిగిపోవడంతో ఏటికేడు అభయారణ్యాలుగా ఉన్న అడవులు ఎడారులను మరిపిస్తున్నాయి. దీంతో 23శాతానికి చేరింది. నూతన కరీంనగర్‌లో మాత్రం కేవలం 0.02శాతమే అడవులున్నాయి. అక్రమార్కుల వేటుకు అన్ని మొక్కలు అంతరించిపోతున్నాయి. గడిచిన అయిదేళ్ల కాలంలో పోడు వ్యవసాయం కోసం సుమారు 40 వేల హెక్టార్లలో అడవులు నరికినట్లు అధికారులు గుర్తించారు. వందల మందిపై కేసులు నమోదు చేశారు. కానీ వనమేధం మాత్రం ఆగడం లేదు.
హరితహారంలో సైనికులమవుదాం
హరితహారం పథకం గతంలో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. వర్షాభావ పరిస్థితులతో 2016–19వరకు కోట్ల మొక్కలు నర్సరీల్లో మిగిలిపోయాయి. 2018లో మొక్కలు నాటినా వాటి సంరక్షణ చర్యలు పడకేయడంతో సగం మొక్కలు జీవం కోల్పోయాయి. ఈ క్రమంలో మనమంతా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో సైనికులమైతే పర్యావరణానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. నివాసాల్లో, రహదారులు, అడవుల్లో వీటిని వృద్ధి చేస్తే విపత్తులు రాకుండా ఉంటాయి.
2022 45.7
2023 45.1
2024 45.3
2025 45.4
2026 45 (ఏప్రిల్28)
ఏటా ప్రమాదకరంగా ఉష్ణోగ్రతలు
(డిగ్రీల సెల్సియస్‌లో)
గత ఐదు రోజులుగా నమోదైన
ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల సెల్సియస్‌లో)
తేది జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి
24 42.6 42.5 42.4 42.6
25 44.1 43.8 43.4 44.3
26 44.4 42.3 44.0 42.5
27 44.1 43.0 43.6 45.9
28 45.8 45.6 45.2 45.9


