కాంగ్రెస్‌లో రచ్చరచ్చ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో రచ్చరచ్చ

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

పార్టీలో మళ్లీ కొత్త పాత లొల్లి నెట్టుకున్న నాయకులు ‘కుర్చీ’ కోసం పంచాయితీ డీసీసీ అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌ ముందే రభస సస్పెండ్‌ చేస్తామంటూ డీసీసీ అధ్యక్షుడి హెచ్చరిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం రసాభాసగా మారింది. కుర్చీ కోసం మొదలైన పంచాయితీ.. షరా మామూలుగానే పాత కొత్త నాయకుల గొడవకు దారితీసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, టికెట్లు వచ్చినవాళ్లే ఇంకా కుర్చీలు కావాలంటున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు గ్రూప్‌లు ఒకరిని ఒకరు నెట్టుకొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, పీసీసీ కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ ఎదుటే ఈ గొడవ చేటుచేసుకుంది. ఇలానే చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయిస్తానంటూ మేడిపల్లి సత్యం హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది.

‘కుర్చీ’ కోసం గొడవ

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, బ్లాక్‌, మండల, డివిజన్‌ అధ్యక్షుల నియామకంపై చర్చించేందుకు మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే, మాజీ కార్పొరేటర్‌ గంట కల్యాణిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానించిన క్రమంలో మహిళలకు రిజర్వేషన్‌ అంటారు.. వేదికపై మహిళలకు కుర్చీ వేయలేదని కల్యాణి అనడంతో వివాదం మొదలైంది. సబ్జెక్ట్‌ మాట్లాడాలంటూ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సూచించారు. ఇదే సమయంలో ముల్కల కవిత, మాసూంఖాన్‌, పెద్దిగారి తిరుపతి తదితరులు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, తమకు టికెట్లు రాలేదు, మీకు కార్పొరేటర్‌ టికెట్లు ఇచ్చినా ఇంకా కుర్చీలు వేయలేదంటున్నావా అంటూ కల్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్క్రాప్‌ అంటూ ప్రోగ్రాం చేసి, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి కార్పొరేటర్‌ అయ్యారంటూ మండిపడ్డారు. కొంతమంది కల్యాణికి మద్దతుగా రాగా, రెండు వర్గాల నడుమ తోపులాట సాగింది. మేడిపల్లి సత్యం జోక్యం చేసుకొని పద్ధతి మా ర్చుకోకపోతే సస్పెండ్‌ చేయిస్తానని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement