హుజూరాబాద్: అన్నదాతలను డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్, పెట్రోల్ నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారుల నుంచి మొదలుకొని పెద్దపెద్ద వాహనాలకు పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం కావడంతో హార్వెస్టర్లకు, ట్రాక్టర్లకు డీజిల్ తప్పనిసరి. బంకుల్లో కొరత ఉండడంతో రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు క్యాన్లతో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. హుజూరాబాద్ పట్టణంలో క్యాన్లతో బంకుల వద్ద రైతులు బారులు తీరారు.
హుజూరాబాద్‌లో డీజిల్ కోసం క్యూలో పెట్టిన క్యాన్లు
పెట్రోల్, డీజిల్ కొరతలేదు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో పెట్రోల్ బంకుల యజమానులు, గ్యాస్ డీలర్లతో గ్యాస్, పెట్రోలు సప్లయ్‌పై సమీక్ష నిర్వహించారు. వరి కోతల నేపథ్యంలో హార్వెస్టర్లు, ధాన్యం తరలించే లారీలు, ట్రాక్టర్లకు ఎలాంటి డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో గ్యాస్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. పెట్రోల్ బంకులు డ్రై లేకుండా చూసుకోవాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే పౌరసరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రామగుండం ఆయిల్ డిపోలో సరిపడే ఆయిల్ నిల్వ లు ఉన్నాయనిపేర్కొన్నారు. ప్రజలంతా లేనిపోని వదంతులు నమ్మవద్దని తెలిపారు.


