‘సహకారం’లో సోలార్‌ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

‘సహకారం’లో సోలార్‌ వెలుగులు

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

5,500 యూనిట్ల ఉత్పత్తితో ప్రాజెక్టుకు శ్రీకారం

ఆర్థిక బలోపేతం దిశగా మంథని పీఏసీఎస్‌

గుంజపడుగులో రూ.3.50కోట్లతో నిర్మాణం

పనులు పరిశీలించిన నాబార్డు.. కార్యదర్శుల బృందాలు

మంథనిరూరల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్న సహకార సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోనూ సహకార సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నా బార్డు సహకారంతో పెద్దపల్లి జిల్లా సహకార బ్యాంకు 4శాతం వడ్డీతో మంథని సహకార సంఘానికి రూ.3.50కోట్ల రుణం అందించగా పనులు ఇటీవలే ప్రారంభం అయ్యాయి.

పెద్దపల్లి జిల్లాలో నాలుగు ప్లాంట్లు

పెద్దపల్లి జిల్లాలోని సహకార సంఘాల ద్వారా నాలుగు పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంథని, రాఘవాపూర్‌, నందిమేడారం, కాల్వ శ్రీరాంపూర్‌లో పనులు ప్రారంభం అయ్యారు. ఇందులో మంథని మండలం గుంజపడుగు శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్‌పవర్‌ ప్లాంట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఐదెకరాలు.. రూ.3.50కోట్ల వ్యయం

మంథని మండలం గుంజపడుగు శివారులో ఐదు ఎకరాల స్థలంలో రూ.3.50కోట్ల వ్యయంతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఆగస్టు 11న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే తుదిదశకు చేరుకున్నాయి.

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో..

సహకార సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకుని మంథని సహకార సంఘం ఆధ్వర్యంలో సోలార్‌పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ విషయంలో కలెక్టర్‌ సైతం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్‌పీడీసీఎల్‌ విద్యుత్‌ కొనుగోలు..

ప్రతీరోజు 5,500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఎన్‌పీడీఎల్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనులు చివరిదశలో ఉండగా మరో నెలరోజుల్లో పూర్తిగా విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విద్యుత్‌ ఉత్పత్తిలో సహకార సంఘానికి ఏడాదికి రూ.40నుంచి రూ.50లక్షల ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పలు బృందాల పరిశీలనలు

గుంజపడుగులో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌పవర్‌ ప్లాంట్‌ను పలు బృందాలు పరిశీలించాయి. వారం క్రితం రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల కార్యదర్శుల బృందంతో పాటు ఇటీవల నాబార్డు అధికారుల బృందం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సోలార్‌ ద్వారా ఎంత పవర్‌ఉత్పత్తి అవుతుందని అడిగి తెలుసుకున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత మేర ఆర్థికాభివృద్ధి సాధించుకోగలమనే విషయాలను తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement