కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి(కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భరోసా కల్పించారు. ఉండటానికి నీడ లేక శ్మశానవాటికలో తలదాచుకుంటున్న హృదయ విదారక ఘటనపై స్పందించారు. కరీంనగర్‌లోని గాంధీనగర్‌లో అద్దెకుంటూ ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వకపోవడంతో, ఆ కుటుంబం పద్మనగర్ శ్మశానవాటికలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న మేయర్ పద్మానగర్ శ్మశానవాటికకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిత్యవసర సరుకులను అందజేశారు. ఆడ పిల్లల చదువు విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, పూర్తి సహకారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
నాలుగు చోట్ల కర్మకాండ నిలయాలు
అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన కుటుంబాలు ఇబ్బంది పడకుండా నగరంలోని నాలుగు చోట్ల కర్మకాండ నిలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు ఇప్పటికే శ్మశాన వాటికల సమీపంలో అనువైన స్థలాలను ఎంపికచేశామన్నారు. మార్కండేయ కాలనీ, అలకాపురి కాలనీ, కేబుల్ బ్రిడ్జి, రేకుర్తి శ్మశాన వాటికల ప్రాంతాల్లో జీప్లస్ వన్ అంతస్తుతో భవనాలను నిర్మిస్తామన్నారు. కర్మకాండ నిలయాలను అద్దె ఇండ్లలో నివసించే కుటుంబాలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరీంనగర్‌లో చాలా చోట్ల కిరాయి ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిసే వరకు ఇంటి యజమానులు రానివ్వని దుస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నాలుగు దిక్కుల నాలుగు కర్మకాండ నిలయాలను నిర్మించి అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కర్మకాండ నిలయానికి రూ.50 లక్షల నిధులు కేటాయించి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు.
రూపాయి..పై ఇబ్బంది పెట్టొద్దు..
నగరపాలక సంస్థలో విజయవంతంగా సాగుతున్న అంతిమయాత్ర అఖరి సఫర్ (రూపాయి)పథకం పై నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టొద్దని అధికారులను మేయర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెంది కరీంనగర్‌లో నివాసం ఉంటూ చనిపోతే ఆధార్ కార్డు వివరాలు ఎక్కడున్నా, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏరియా జవాన్ ధృవీకరణ చేస్తే వారికి రూపాయి అంత్యక్రియలను అందిస్తామన్నారు. పాలకవర్గం సహకారంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అండగా ఉంటామన్న పోలీసులు
శ్రీకాంత్ కుటుంబానికి కరీంనగర్ టూ టౌన్, కొత్తపల్లి పోలీసులు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పద్మనగర్ శ్మశాన వాటికలో నివాసం ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులను మంగళవారం టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్సై తిరుపతి పరామర్శించారు. గాంధీనగర్‌లోని అద్దె ఇంటి యజమానితో మాట్లాడి అద్దె ఇంట్లో ఉండేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. లేదంటే ఏదైనా లాడ్జిలో రూం ఇప్పిస్తామని, కర్మకాండ జరుపుకునేందుకు ఫంక్షన్‌హాల్ ఇప్పిస్తామని పోలీసులు అభయమిచ్చారు. అయినప్పటికీ మృతుల కుటుంబ సభ్యులు పద్మనగర్ శ్మశాన వాటికలోనే ఉండేందుకు మొగ్గు చూపినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
శ్మశానవాటికలో తలదాచుకున్న శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పరామర్శ
నిత్యావసర సరుకులు అందజేత
నగరంలో నాలుగుచోట్ల కర్మకాండ నిలయాలు


