రామగుండం: ప్రజాయోగ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు అనుకూలంగా ఉన్నా అధికారుల నుంచి స్పందన కరువైందని, డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ అన్నారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్స్, వేళల మార్పు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో మంగళవారం డివిజనల్ యూజర్స్ అండ్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) సమావేశం జరిందిందని చెప్పారు. రామగుండం ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ హాజరై పలు సమస్యలను రైల్వే జీఎం, డీఆర్‌ఎంల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సాక్షి దినపత్రికలో మార్చి 12వ తేదీన ‘పది రూపాయలకే 45 కి.మీ.ప్రయాణం’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై చర్చ సాగినట్లు తెలిపారు. కాగజ్‌నగర్ నుంచి బోధన్ మెమూ రైలు.. కాగజ్‌నగర్–కరీంనగర్ వరకు వెళుతుందని అనౌన్స్‌మెంట్ చేయడంతో బోధన్ వెళ్లే ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నాని అన్నారు. నేరుగా కాగజ్‌నగర్ నుంచి బోధన్ వరకు వెళుతుందని అనౌన్స్‌మెంట్ చేస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగి అక్యుపెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ తప్పిదంతోనే మెమూకు స్పందన కానరావడం లేదని అన్నారు. రైల్వే ప్లాట్‌ఫారంపై అత్యవసరంగా ఫస్ట్ ఎయిడ్ వైద్యం ఏర్పాటు చేయాల్సి ఉన్నా గది మూసి వేసి ఉందన్నారు. ఫలితంగా ఇద్దరు గర్భిణులు ప్లాట్‌ఫారంపైనే పురుడు పోసుకున్నారని, మరో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు రామగుండంలో హాల్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. భాగ్యనగర్ తర్వాత రామగుండం–కాజీపేట మధ్య కాజీపేట(రైలు నం.17036) ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి సమయ వేళలు మార్చాలని, నవజీవన్, జైపూర్, తమిళనాడు తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి రైల్వేజంక్షన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పెద్దపల్లికి చెందిన డీఆర్‌యూసీసీ సభ్యుడు నారాయణ్‌దాస్ తివారి కోరారు. అమృత్‌భారత్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం నెమ్మగించిందన్నారు. పెద్దపల్లి–కూనారం మధ్య వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. చీకురాయి బీ–క్యాబిన్ పనులు సైతం త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్, రాయపూర్, మైసూర్–జైపూర్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్, భగత్‌కీకోఠి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
సమావేశంలో చర్చకు వచ్చిన ‘సాక్షి’ కథనాలు
డీఆర్‌యూసీసీ సమావేశంలో అనుమాస శ్రీనివాస్


